"అమ్మ!
మగవాడి తోడు లేకుండా బ్రతకగలవని నిరూపించింది నువ్వు. పెళ్లి జీవిత గమ్యం కానక్కర్లేదని చెప్పిందీ నువ్వే. నేను లయతో చేసే పని వలన ఎంత మంది ఆడవారు తమ కష్టాలను బయటకు చెప్పుకుని స్వేచ్ఛగా జీవితాన్ని గడపటానికి సిద్ధంగా ఉన్నారో తెలుసా? కొందరికి ఆర్ధిక సమస్య, కొందరికి మానసిక సంఘర్షణ, కొందరికి పెళ్లి సమస్య, ఇంకొందరికి పిల్లలు పుట్టక మనోవేదన, పిల్లలు ఉన్నవారికి పిల్లల జబ్బుల సమస్య. వాళ్లకి చేయుత ఇచ్చే లయ ఆశయం ముందు నాకు పెళ్లి అవసరం అనిపించట్లేదు. ఈమధ్యే ఓ సంస్థ వారు మా NGO గురించి తెలుసుకుని Germany కి రమ్మన్నారు. వారు ఆర్ధిక సాయం చేస్తే ఎంతో మంది ఆడవారికీ, పిల్లలకి సాయం చెయ్యగలం. నేను తప్పు చేస్తే, ఆ తప్పు ఇదని చెప్పు, కానీ నీ మౌనం ఇంకా ఎన్నాళ్ళు? నీ గొంతులో రాగాలు వినలేని వంటరితనం అనుభవిస్తున్నాను. నీ పాటలు వినాలని, నీతో ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది, నీ పంతం ఏమిటో తెలియదు. నేను ఫోన్ చేసినా నువ్వు ఎత్తవు కదా! నీ వివరాలు మన పక్కింటి చాడీల చిత్ర గారిని అడుగుతూనే ఉన్నాను. నీగురించి తక్కువగా ఊళ్ళో విషయాలు ఎక్కువగా చెప్పి, నిన్ను వదిలేసానని నాకు చీవాట్లు పెడుతోంది. ఇంకా ఎన్నేళ్ళు నాకీ తిప్పలు? నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నవో చెప్తూ ఈసారైనా జవాబు ఇస్తావని ఆశతో ..
- నీ శృతి"
నాకంటూ ఉన్నది అమ్మ ఒక్కతే. నేను పెళ్లి వద్దు అన్నానని కోపం తెచ్చుకునే వ్యక్తి కాదు ఆవిడ. మరి ఎందుకో ఇలా నన్ను ఏడిపిస్తోంది? కొన్ని వందల వేల సార్లు ఆలోచించాను.
అనగనగా ... అని మొదలు పెట్టడానికి ఇది ఎప్పుడో ఎవరికో జరిగిన కథ కాదు, మా అమ్మతో నా కథ. నేను శృతి, మా అమ్మ, గీత, మాది విశాఖపట్నం. మా సాధారణ మధ్యతరగతి గీతంలో నేను పల్లవైతే అమ్మ చరణం. నాకు తండ్రి లేడు. ఎందుకు లేడో చిన్నప్పుడు తెలియదు, పెద్దయ్యాక తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు. నా తల్లి మధుర గాయని, చదువుల సరస్వతి, ఒక్కో రాగంలో పాట పాడేటప్పుడు ఒక్కో విధంగా నాకు అర్ధం అయ్యేది. పాడటం ఆవిడకు ఇష్టమైనా స్టేట్ బ్యాంకులో అకౌంటెంట్‌గా చేరింది, మరి నన్ను పోషించాలి కదూ! తను లేని సమయాల్లో నన్ను చూసుకోమ్మని మా అమ్మమ్మని అడిగింది, అమ్మమ, తాతగారు నన్ను చూసుకునేవారు. పొద్దున్నే అమ్మ పాడే భూపాల రాగంలో సుప్రభాతాలు, రాత్రికి నీలాంబరిలో జోల పాటలతో చిన్నతనం గడిపేశాను. స్కూల్ కి వెళ్లే వయసులో ఓ వంద రూపాయిలు ఉంటే చాలు చాక్లెట్లు కొనటమే లక్ష్యంగా తృప్తి పడ్డాను, మా అమ్మ నాకు, "శృతి లయలు పాటకి జననీ జనకులు. వాళ్లకి పుట్టిన పాప అంతులేనిదై, అనంత వాణియై, ఆలపనై ఈ జగత్తుని నడిపిస్తుంది, ఆ జగత్తుకి పార్వతి పరమేశ్వరులు అమ్మా నాన్నలు. వాళ్ళు ఇచ్చిన బుజ్జి బంగారు పాపవి నువ్వే" అని సంబరపడుతూ చెప్పేది.
సమస్యల రాగాలాపన
నాకు రాగాలు అర్ధం అయ్యినట్టుగా నాగొంతుకి గాత్రం, గీతం అలవాటు కాలేదు. స్కూల్ నుంచే నాకు స్పందించే గుణం కాస్త ఎక్కువ, మనస్తత్వాలు చదవటం, మానవ హక్కులు పోరాటం, వంటరి బ్రతుకులూ - చేయూత లాంటి అంశాలు గురించి మాట్లాడటం అలవాటు అయ్యింది, కాలేజీ లో కూడా, అవే సబ్జెక్టులు తీసుకున్నాను. అసలు నా ఆసక్తి మా అమ్మ వంటరి పోరాటం నుంచి వచ్చిందేమో. మెల్లమెల్లగా నా తల్లిపై విమర్శలు నాకు వినబడేవి, ఆవిడ నాకు ఎన్నో విషయాలు తెలియనివ్వకుండా రాగాల పరదా వేసేది. సంతోషం లో హిందోళ రాగం, వాన పడితే అమృతవర్షిణి, నా మార్కులు చూసి మోహన రాగం, చిరాకు వస్తే సహానా, బ్యాంకులో సమస్య అయితే మాండు రాగం, దేవుడిపై భారం వేసే ఇబ్బంది వస్తే శంకరాభరణం రాగాలు పాడుతూ మాట్లాడేది. అన్నట్టు, మా ఇంటిదగ్గల శివాలయంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకి మా అమ్మపాడే "శంకరాభరణం" సినిమాలో పాటలు వినటానికి ఎంతో మంది వచ్చే వారు. ఆవిడ గొంతుకి నాతో పాటు ఎంతో మంది అభిమానులు ఉన్నారని అనుకున్నాను. కొందరు వాళ్ళింట్లో పిల్లలకి సంగీతం నేర్పమని వెంటపడే వారు. "నా గొంతుకి శ్రమ ఇచ్చి తెచ్చుకునే చాలీ చాలని జీతంతో నా శృతి ఆలాపన అవ్వలేదు" అనేది. అర్ధం అయ్యే వారికి అయ్యేది, అర్ధం కానీ వారు విమర్సించుకునే వారు. మా అమ్మమ్మా తాతలు కూడా విద్వాంసులే, ఒకరు వంటింట్లో గిన్నెలతో వాయిస్తుంటే మరొకరు మాటలతో వాయించేవారు. మధ్యలో మా అమ్మ వాళ్ళ మోతలో కూడా తాళం వెతుక్కుని రాగమాలిక చేసేది. అమ్మమ్మ చెప్పేది, మా అమ్మ సంగీతం లో ప్రొఫెసర్ అవ్వాలనుకుందట, మా తాతగారు "నీకు చదువెందుకు? పెళ్లి చేసుకో" అని అడ్డురాకపోతే ఈరోజు నేను ఒక సెలబ్రిటీ కూతురు అయ్యేదాన్నేమో. దుష్ట తాత! నాకోసం జీతం డబ్బు పోగేసి, ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి నన్ను అనాధాశ్రమానికి తీసుకెళ్లి అక్కడ పిల్లల కోసం ఒక నెల జీతం ఖర్చుపెట్టేసేది, అక్కడ వాళ్ళ కోసం ఎన్నో పాటలు పాడేది. మా అమ్మ పాడుతూ ఉంటే ఫోటోలు, వీడియోలు తీసి Facebook లో పెట్టేదాన్ని, కొందరు ఆవిడ పాటను కన్నా ఆవిడ అంగభంగిమల గురించి రాస్తుంటే ఇక పోస్టులు ఆపేసి ఆవిడ పాటల వీడియోలు నేనే దాచుకున్నాను.
లయని కలిసిన శృతి
అమ్మమ్మ తాతగార్లు నేను బిఏ చేసే సమయానికి కాలం చేశారు. మా అమ్మ అప్పటికి బ్యాంకు లో మేనేజర్ అయ్యింది, హోదా తో పాటు ట్రాన్స్ఫర్లు. ప్రతీ చోటా అద్దె ఇంటి కోసం వేట. ఒక ఒంటరి తల్లిగా నాతో ఒక్కో ఇంటిని వెతకటం ఎంత కష్టమో నేను కళ్లారా చూసేదాన్ని, ప్రతి ఇంటి యజమానికి నాకు రాని ఎన్నో ప్రశ్నలు, నాకే అక్కర్లేని ఎన్నో సమాధానాలు అవసరం అయ్యేవి. "తట్టుకునే వాళ్ళకే పరీక్షలు పెడతారు ఆదిదంపతులు" అనేసి "ఏల నీ దయ రాదు?" అని త్యాగరాజ కృతులు పాడుకుంది కానీ ఎప్పుడూ కుమిలిపోలేదు, మేము హైదరాబాద్‌కి వచ్చాక బ్యాంకు లోన్ తో చిన్న అపార్ట్మెంట్ తీసుకుంది. పెరిగే నా చదువుకి అయ్యి ఖర్చు, బ్యాంకు కి కట్టాల్సిన లోన్ డబ్బులు పోయాక పెద్దగా ఏమి మిగిలేది కాదు, "వంద రూపాయిలు మిగిలాయి చాక్లెట్లు కొందామా? ఐస్ క్రీం తిందామా?" అంటూ ఉండేది, "ఏమీ వద్దు. మానస సంచరరే పాట పాడు" అనేదాన్ని. ఆ పాట వినడం కోసం ఎన్ని జన్మలైనా ఆవిడకే పుట్టాలని అనిపించేది. బిఏ అయ్యాక రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం నేను ఢిల్లీ కి వెళ్లాను. అమ్మని వదిలి వెళ్ళటం నాకు అదే మొదటి సారి. నాకు కొత్త మొబైల్ ఫోన్ కొని, రోజు సాయంత్రం తన బ్యాంకు అయ్యి సమయానికి ఫోన్ చెయ్యమని చెప్పింది. ఢిల్లీలో మా అమ్మలా ఎంతోమంది ఆడవాళ్లు తమ కాళ్ళ మీద తాము నిలబడటం చూసాను. దేనికి భయపడని స్వభావం, ఉన్నత ఆశయాలతో కనిపించారు. ఓ రోజు అనుకోకుండా ఓ సెమినార్ ఆపేసారు, ఆ ప్రెసెంటేషన్ ఇవ్వాల్సిన ఆవిడ మరణించిందని తెలిసింది, ఆవిడ ఆ రోజు మాట్లాడాల్సిన అంశం "ఆడవారి హక్కులు -స్వేచ్ఛ", కానీ దురదృష్టవశాత్తు ఆవిడ భర్త వలెనే చనిపోయిందని కేసు అయ్యిందని తెలిసింది. మరో సెమినార్ "రేప్ విక్టిమ్స్" కి వెళ్లాను. లయ అన్న పేరుతో ఒక అమ్మాయి అదరగొట్టింది, కాదు నేను ఎంతో అదిరిపోయాను. అయితే ఆ అమ్మాయి కూడా అలంటి ఓ పరిస్థితిని ఎదురుకుని వ్యవస్థ తో పోరాడి, జనాలలో చైతన్యం తీసుకురావటమే లక్ష్యం గా బ్రతుకుతోందని తెలిసి కదిలిపోయాను. "నిజ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితులే నీకు మార్గ నిర్దేశం చేస్తాయి" అన్న మా అమ్మ మాటలు నాకు పదే-పదే థాట్ బిలావల్ రాగం లో మారుమ్రోగాయి. మనం ఎదురుకునే చేదు పరిస్థితి గురించి మాట్లాడలేని ధైర్యం, చేయూత ఇవ్వలేని జీవనం బ్రతికినా వ్యర్థం అనిపించింది. వెంటనే ఆ సెమినార్ అయ్యాక తనతో పని చేస్తానని చెప్పను. "మళ్ళి ఆలోచించుకుని ఓ నెల తర్వాత నేను గుర్తొస్తే నాకు ఫోన్ చెయ్యి" అని నెంబర్ ఇచ్చింది.
ఇంటర్న్‌షిప్ అయ్యి ఇంటికి వచ్చిన రాత్రి మా అమ్మతో "అసలు నువ్వెందుకు వంటరిగా ఉన్నావు" అని అడిగాను. "నా జీవితం రామాయణ భాగవతాల వంటి గొప్పది కాదు విడమర్చి చెప్పటానికి, కానీ నిన్ను నన్ను బలితీసుకునే మనుషులనుంచి నేను దూరంగా వచ్చేశాను. ఇంతక మించి నీకు తెలియాల్సిన అవసరం లెదు" అంది. నాకు తెలియక్కర్లేని బాధ తనలో పెట్టుకుని పైకి ఆనందంగా ఉండే మా అమ్మని చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. మా అమ్మని, "ఎప్పుడైనా మరో పెళ్లి చేసుకోవాలనుకున్నావా?" అని అడిగాను, "పెళ్లి, సంసారం, జీవితానికి అంతిమ లక్ష్యాలు కావు." అంటూనే "నీ సంగతి ఏంటి? బ్యాంకు లో నీకు సంబంధాలు చెప్తున్నారు, చూడమంటావా? చదువుకుంటావా? లేదా ఢిల్లీ లో ఎవరినన్నా చూసేసుకున్నావా?" అని అడిగింది. "అమ్మ! నాకు ఎందుకో చిన్న తనం నుంచి మొగవాడి అవసరం కనిపించలేదు, పైగా ఆడదాని లక్ష్యాలకు అడ్డుగా ఉన్న మగవాళ్ళని నేను సహించలేను, లయ పరిచయం అయ్యింది, ఢిల్లీలో తనతో ఓ NGO కోసం పని చేద్దాం అనుకుంటున్నాను, నీ అనుమతి కావాలి, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా ఖర్చు భారం నీ మీద పెట్టను, లయ చేసే పనిలో సాయపడదాం అనుకుంటున్నాను" అన్నాను. "అన్ని నిర్ణయించుకునే వచ్చావన్నమాట! ఎన్నాళ్ళు అలా?" అని అడిగింది. "తెలియదు, లయతో పని చేస్తూ ఉండిపోగలిగితే అక్కడే ఉంటాను లేదా నేను సొంతంగా మానవ హక్కులకోసం పోరాటం చేస్తానో ఏమో!" అన్నాను. నేను చెప్పేది మా అమ్మ పూర్తిగా వినకుండా వెళ్లి పడుకుంది. మా అమ్మతో ఆ తరువాత రోజు "ఏమిటమ్మా? వెళ్ళ మంటావా?" అని అడిగాను, మూడు రోజులైనా జవాబు లేదు. నాతో ఎందుకో తెలియని మౌన యుద్ధం చేసింది, పదిరోజుల మౌనరాగం లో పదాలు లేని పాటలు వినలేక లయ కి ఫోన్ చేసి ఢిల్లీకి ఏడేళ్ల ముందు వచ్చేసాను. లయ తో జరిగింది చెప్పాను, తన NGO పనుల్లో సాయం చేసేదాన్ని, నాకు పార్ట్ టైం రైటర్‌గా ఉద్యోగం ఇప్పించింది. ఆ డబ్బు చాలేది కాదు, లయ ఆశయం పెద్దదైనా, పెద్ద మనసు తో సాయం చేసే వారు కనిపించలేదు, పైగా ఆడవాళ్ళు అనే చులకన భావం, మా అమ్మ గుర్తుకు వచ్చేది. కొన్నాళ్ళకి ఒకాయన లయ సెమినార్ చూసి తనకి తెలిసిన Germany సంస్థతో కలిపారు. అక్కడికే మా ప్రయాణం. ఎప్పటికప్పుడు జరిగేవన్నీ అమ్మకి చెపుదాం అని ఫోన్ చేసినా, ఆవిడ ఫోన్ ఎత్తేది కాదు. నేను పెళ్లి వద్దు అన్నానని కోపం తెచ్చుకుందా? తనలా వంటరి దానిలా మిగిలిపోతానని బాధ పడుతోందా? ఇంటికి వెళ్తే ఆవిడను చూసి నేను కరిగిపోయి ఆవిడ మాట వినేస్తానేమో అని ఇంటికి వెళ్ళలేదు. మంచో చెడో నాకు ఓ లక్ష్యం ఏర్పడింది. మదర్ తెరెసా అంత కాక పోయినా ఈ జీవితాన్ని అర్ధవంతంగా గడపాలని. అమ్మ ఎవరికైనా మొదటి ప్రియురాలే. తనని వదిలెయ్యలేక మెయిల్స్ రాస్తూ, పక్కింటి ఆవిడకి కి ఫోన్లు చేస్తున్నాను.
చూస్తూ ఉండగానే Germany కి వెళ్లివచ్చి రెండేళ్ళు పూర్తి అయ్యాయి. రెండేళ్లగా ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన మేము మాట్లాడాము. మాకంటూ ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తోంది. ఒకటే లోటు, అమ్మని చూసి తొమ్మిదేళ్లు అయ్యింది. "అమ్మ కచ్చితంగా వస్తుంది అధైర్యపడకు" అనేది లయ. నాకన్నా వయసులో కాస్త పెద్దది, ఇంట్లో తను లైంగిక వేధిపుకు గురైందని తెలిసి చదువు మనిపించి బలవంతంగా పెళ్లి చేయబోయారు, తన వాళ్ళని కాదనుకుని, వాళ్ళని వదిలేసి వచ్చేసింది. తనకి కూడా పెళ్లి ఆలోచన లేదు. మా దగ్గరికి ఎంతో మంది ఆడవాళ్ళూ ఆశ్రయం కోసమో, కాలేజ్ చదువుకి డబ్బు సాయం కోసమో, వైద్య సాయం కోసమో, వేధింపులు రిపోర్ట్ చెయ్యాలనో, లాయర్ల కోసమో వస్తారు. మేము అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆడవారితో ఓ సంఘం ఏర్పాటు చేసాము. ఐదేళ్ల ముందు ఓ గర్భిణీ తన ప్రసవానికి డబ్బు లేదని వచ్చి ఆడపిల్లకు జన్మనిచ్చి మరణించింది. ఆ పాప కోసం ఎవ్వరూ రాలేదు, నేనే పెంచుకుంటున్నాను. పాప పేరు "ఆలాపన", అదే పేరుతో, Germany వారి సాయంతో NGO మొదలు పెట్టాము. మేము చేసే పనులకు గుర్తింపు వస్తోంది. ఈ సంవత్సరం మా ఇద్దరికీ "విమెన్ లీడింగ్ ఇన్ చేంజ్" అవార్డు ఇస్తామన్నారు. లయ ఆనందానికి హద్దులు లేవు, నన్ను మాత్రం హంసానందీ రాగం లో శోఖ విషాద నిశ్శబ్ద రాగాలు అల్లుకున్నాయి, అమ్మ నాతో మాట్లాడేది ఎప్పుడు? తొమ్మిదేళ్లు గడిచాయి. నా ఐదేళ్ల కూతురికి, నేను దాచుకున్న అమ్మ వీడియో పాటలు చూపించి, రాగాలు నేర్పుతున్నాను. అమ్మ గొంతులో కమ్మగా ఉండే "మానస సంచరరే", రికార్డు చేసి అమ్మ పుట్టినరోజుకి పంపాలి.
గీతానికి ఆలాపనే జవాబు
కాలచక్రం ఇంకాస్త ముందుకు కదిలింది. కాలానికి జాలి వేసి ఆలాపన వీడియో కన్నా జవాబు పంపమని అమ్మకి సిఫార్సు చేసినట్టుంది. జవాబు వచ్చింది:
మీ YouTube వీడియోలు చూసి సాయం పొందిన ఆడవారి కామెంట్లు చదువుతున్నాను, నేను ఇన్నాళ్లు నీకు జవాబు ఇవ్వనిది నీ లక్ష్యం లో అడ్డు రాకూడదని. ఒక లక్ష్యం కోసం బ్రతకటం అంటే ఎవరి మాటా లెక్క చెయ్యకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా మొండిగా ముందుకు సాగటమే. మొదట్లో నువ్వు అన్న మాటకి భయం వేసింది, నన్ను చూసి వంటరితనం అలవాటు చేసుకుంటావేమోనని. కానీ నీది ఏ నిర్ణయమైనా అడ్డు రాకూడదు అనుకున్నాను. సమాజంలో కట్టుబాట్ల నుండి భర్తని వదిలి బ్రతకాలనుకున్నప్పుడు నాకు ఎవరూ సాయం రాలేదు, ఇక నీ భారం ఉండేసరికి మా అమ్మా - నాన్నలకి తప్పలేదు. న్యాయ వ్యవస్థ తో అలిసిపోయాను, చుట్టాల విమర్శలకు విసికిపోయాను, మన అనుకున్న వారు దూరంగా జరిగిపోయారు. ఇష్టాలు కాదనుకున్నాను, వెళ్లిపోయిన వారి కోసం కాకుండా కొత్త అవకాశాలని స్వాగతించాను. కొన్ని సార్లు నా పరిస్థితి చూసి జాలి వేసి మా అమ్మే, "తొందర పడ్డావేమో? సద్దుకుపోయి ఉంటె ఎలా ఉండేదో ,వంటరిగా ఎంత పోరాటం చేస్తావ్?" అని అనుమానంగా అడిగేది, కానీ నా సమస్య నాకు మాత్రమే తెలుసు. ఆవిడ జాలి కూడా నాకు భారంగా అనిపించేది. అందుకే, నీకు ఎవరు లేని వంటరితనం పరిచయం చేద్దాం అనుకున్నాను. నీకు రెక్కలు వస్తున్నాయని తెలిసి ఎగరనిచ్చాను, అసలు నీ పక్కన ఉండి నిన్ను ఇంకాస్త ప్రోత్సహించి ఉండాల్సింది. కనీ పోరపాటుకైనా నేను నోరు జారి నిన్ను బాధపెట్టకూడదు అనుకున్నాను. నాకు తెలుసు, నీ నిర్ణయం అంత తేలిక విషయం కాదని, చేతిలో డబ్బు లేకుండా వేలిపోయావని. కానీ ఇప్పుడు, నీ వల్ల రెక్కలు తెచ్చుకున్న ఆడవారిని చూసి ఆనందిస్తున్నాను. నీ ఆశయం, ఆలోచన గొప్పవి. అందుకేనేమో నా శృతిని వంటరిదాన్ని చెయ్యకుండా లయతో కలిపారు ఆదిదంపతులు. నిన్ను తలుచుకోని రోజు లేదు. చాడీలు చిత్ర గారికి నువ్వు ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు నేను పక్కనే ఉండి వినేదాన్ని. నాకు నువ్వు తప్ప ఎవ్వరు ఉన్నారు చెప్పు?
- అమ్మ".
మెయిల్ రిప్లై రావటానికి తప్పిన తాళం కారణం అయినా అమ్మ భావాలెన్నో అందులో వినిపించాయి. అది చూసి నా కన్నీళ్లు కడలిలా ప్రవహించాయి. వంద వాయిద్యాలు కలిసి మౌనాన్ని చీల్చుకుని మళ్ళీ శివ నర్తనం చేసే శంకరాభరణం రాగంలో తాండవించాయి. అమ్మకి టికెట్లు పంపాక ఎయిర్పోర్ట్ లో అమ్మని చూసినప్పుడు అమ్మ కౌగిలింత కోసం చిన్నపిల్లలా పరుగున వెళ్ళాను. నా మీద బెంగ వల్లనేమో, ఆవిడ చిక్కిపోయింది. తాను దూరమై నన్ను ఎంతో మందికి చేరువ చేసింది, ఆవిడని విమర్శిస్తున్నారు అని నేను వదిలేసిన అదే సోషల్ మీడియా లోనే అమ్మ నన్ను ఫాలో అయ్యింది. ఆవిడ పోరాడలేని వ్యవస్థని వేలు ఎత్తి చూపించే లయతో నాకు పరిచయం అయ్యింది. ఎక్కడనుంచి వచ్చిందో, ఓ పాప నన్ను అమ్మా అంటోంది. ఇప్పుడు మా అమ్మ ఢిల్లీలో సంగీతంలో పిహెచ్డి చేస్తూ, అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి ఎంతో మందికి సంగీతం నేర్పుతోంది. మా అమ్మ లాంటి ఇంకెందరో ఆడవారి ఆశయాలని చెరువ చేస్తోంది, మా "ఆలాపన" ఫౌండేషన్.
ఒక్కమాట! "మనిషిగా పుట్టి సాటి మనిషిని అర్ధం చేసుకోలేని మనసులు, మంచి పనికి సాయం చెయ్యలేని హృదయాలు ఉన్నా లేనట్టే, ఆడదానికైనా, మగవాడికైనా పుట్టినందుకు మానవత్వం అనే లక్షణం ఉండాలి" అని మేము నమ్ముతాం. పెళ్లి చేసుకుంటే ఒక్క కుటుంబాన్నే ఉద్దరిస్తారేమో కానీ మామార్గంలో ఎన్నో కుటుంబాలని ఆదుకున్నాము. మా దారి మీకు నచ్చితే స్వాగతం, నచ్చకపోతే ఆగిపోం, నచ్చేవరకు ఎదురు చూడలేం. మేము ఇంకెన్నో శోకగీతాలని ఆనంద భైరవులు చెయ్యాలి.







Comments
Post a Comment