"సాగరసంగమం-1983" సినిమా లో మీరు చూడని దృష్టికోణం

Sagara Sangamam ( 1983 )

కె.విశ్వనాథ్ గారి సినిమా అభిమానులందరికీ సాటి అభిమాని నమస్కారం.. సినిమాల రీ రిలీజ్ పరంపరలో పూర్ణోదయ వారు ఈ సినిమాని పొరపాటునైనా రీ రిలీజ్ చేయకూడదని విజ్ఞప్తి. ఎందుకంటే తెలుగుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకునే మాలాంటి వాళ్ళకి ఈ సినిమా గొప్పతనం ఎలాగో అర్థం కాదు.  అసలు ఈ రోజుల్లో సినిమాలు చూడడం తక్కువై రివ్యూలు/ మీములు ఎక్కువైపోతున్నాయి. కానీ ఆ రోజులలో, అంటే 1983లో ఈ సినిమాని ఎవరు చూశారో, ఏ రివ్యూలు రాశారో అసలు ఏమీ అర్థం చేసుకొని ఆనందించారో, నాకు తెలియదు. నాకున్న కొద్దిపాటి అనుభవంతో నాకు తోచిన కొన్ని విషయాలతో ఈ సినిమాని మీకు చూపిస్తాను.
  1. సినిమాలో మూడు పాత్రలు అవి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి, పూర్తి అయ్యే దాకా కలవనే కలవవు. అలాంటి సినిమాకి "సాగరసంగమం" అని "త్రివేణి సంగమం లాగా" పేరు.
  2. పైగా "కే. విశ్వనాథ్ సాగర సంగమం" అని ముందుగానే వచ్చేస్తుంది అంటే ఏమాత్రం కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండవు అని ప్రిపేర్ అవ్వాల్సిందే, తెలుగు వాళ్ళు మర్చిపోయిన త్యాగరాజ కృతులువుండే ఆర్ట్ ఫిలిం అన్నమాట !!
  3. సినిమాలో ఓ చోట నాట్య శాస్త్రంలో హస్తాలతో మొదలైన శ్లోకం గురించి వస్తుంది, అలాగే ఈ సినిమా కూడా హస్తాలతోనే మొదలవుతుంది, అక్కడ "కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు" అనే ఆ మూడు ముఖ్యపాత్రాల పేర్లు వస్తాయి.
  4. సినిమాని అలంకరించిన పాత్రలు అని చెప్పటానికి సహాయ పాత్రల వివరాలు వస్తాయి,   నాట్యాన్ని అలంకరించే ఆహార్యాన్ని చూపిస్తారు.
  5. ఇక నాట్యం చేసే వారి పాదాలని చూపిస్తూ వేటూరి గారి పేరు, జంధ్యాల గారి పేరు, పాడిన వారి పేర్లు వస్తాయి.
  6. విష్ణు అవతారాల ఆయుధాల దగ్గర నాట్య గురువుల పేర్లు, ఇళయరాజా గారి పేరు వచ్చింది.
  7. మరి, కె. విశ్వనాథ్ గారి పేరు ఏది? మొదట్లోనే వచ్చేసింది కదా అంటారా? సరే సినిమా మొదలెట్టేద్దాం.
  8. ఈ సినిమా హైద్రాబాద్ లో, రవీంద్ర భారతి లో ఒక నాట్య మయూరి కటౌట్ తో మొదలవుతుంది, ఈ పాత్ర సబ్ ప్లాట్ లోని ముఖ్యపాత్ర. 
  9. ఈవిడని మనకి "కిషోర్" అనే కళాభిమాని (పోనీ కళాకారిణి-కి అభిమాని అనుకుందాం) పరిచయం చేస్తాడు. అవసరమైతే నలుగురు పాత్రికేయులని పెట్టి ఎడాపెడా రాయించగలిగిన ఒక.. బాగా డబ్బున్న వ్యక్తి పరిచయం అన్నమాట.
  10. ఇతనికి డబ్బింగ్ చెప్పింది రాజేంద్ర ప్రసాద్ గారు మీరు సినిమా చూసినప్పుడు గమనించండి. 
  11. ఈ లోపల రిక్షాని తోసుకుంటూ ఒక పాత్ర ఎంట్రీ ! అక్కడే విశ్వనాథ్ గారి పేరు వస్తుంది. ఈ సినిమా కథ ద్వారా మన బుర్రల్లోకి విశ్వనాథ్ గారు ఏమి తోయనున్నారో చూద్దాం...!
  12. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చాడేంటి? (ఓహో! నాట్యం చేసే వారికి అలవాటు ఉండదు కాబోలు చెప్పులు వేసుకోవడం!! అని సినిమా చూసాకే తెలుస్తుంది! లెండి) అని అనుకునే లోపల ఉమ్ములు వేసే ఇండిసెన్సీ. 
  13. ఇక పంచభూతాలు ఆరు ఋతువుల నుంచి త్రికాలములు చతుర్వేదాలతో సహా అద్వైతాన్ని కవర్ చేసేసారు వేటూరి గారు ఇప్పుడు వచ్చే జానకమ్మ పాటలొ..  ఇక్కడ "పంచభూతములు" అని వచ్చినప్పుడు మన "నాట్య మయూరి" అభినయాన్ని మీరు గమనించాలి. భూతాలూ అన్నట్టు చూపిస్తుంది!
  14. ఇండీసెంట్ గా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చిన ఈ వ్యక్తి పేరు ఏమిటో తెలియదు కానీ... వచ్చే పాటకి కాళ్లతో తాళం వేస్తున్నాడు, ఎంతో అసహనంతో ఉన్నాడు. పైగా నాట్య మయూరి, వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ అభినయాలంకరణ మీద పెట్టలేదని మనకు కూడా అర్థమవుతుంది కాబట్టి అతని అసహనం మనకి తెలుస్తుంది. 
  15. సరే, ఇక అన్ని పాజిటివ్ రివ్యూస్ మధ్య "నాట్యానికే కళంకం" అని రాసి పారేశాడు మనకు తెలిసిన అదే ఇండీసెంట్ వ్యక్తి, అతని పేరు "బాలు" అని తెలుస్తోంది. ఇలా రాస్తే కిషోర్ బాబు ఊరుకుంటాడా? "నాట్య శాస్త్రం గురించి రాయడానికి నువ్వేం భరతమునివా?" అని అడుగుతాడు!
  16. సమాధానం ఇవ్వకుండా టాయిలెట్లో కూడా సీసా ఎత్తేసి తాగేసే "తాగుబోతు" అయిన ఈ ఇండీసెంట్ పర్సన్, "బాలు" తిరిగి వచ్చి, పాయింట్ 1 లో చెప్పిన హస్తాలతో మొదలైన శ్లోకం చెప్పి, "రససిద్ధి" కలగాలంటే హస్తాలు, మనసు, దృష్టి నిమగ్నమై ఉండాలి అని అదే భరతముని నాట్య శాస్త్రంలో శ్లోకాన్ని చెప్పి (భరతుడు రస సూత్రాన్ని " విభవ-అనుభవ-వ్యాభిచారి-సంయోగత్-రస నిష్పత్తి "గా నిర్వచించాడు లెండి), భరతనాట్యం, కథక్, కథాకళి, లో "పంచభూతాలని" అభినయించి మరీ చూపించేసి ఆశ్చర్యపరుస్తాడు. శ్లోకం ఏమిటి అంటారా?
యథో హస్త తథో దృష్టి, 
యథో దృష్టి తథో మనః 
యథో మనః తథో భావ, 
యథో భావ తథో రస
అంటే,
హస్తమున్నచోట దృష్టి ఉండాలి,
దృష్టి ఉన్నచోట మనసు లగ్నంకావాలి,
మనసు లగ్నమైనచోట భావం,
భావం ఉన్నచోట రసం తప్పక ఉంటాయి
-అని భావం

Part II
  1. ఇక్కడికి మనకి రెండు ప్రశ్నలు వస్తాయి. మరి ఇంత నాట్య జ్ఞానం ఉన్నవాడు నాట్యం చేయకుండా ఎవరో పెర్ఫార్మెన్స్ గురించి రివ్యూ రాయడం ఏమిటి? అసలు ఇంత ఇండీసెంట్ గా తాగుబోతు అయిపోవడం ఏమిటి? అని.
  2. ఇతని కథని పరిచయం చేయడానికి అన్నట్టుగా పబ్లిక్ గార్డెన్స్ దగ్గర మనకి "రఘుపతి" పాత్ర పరిచయమవుతుంది. 
  3. "మృతిలోన ముగిసినా, చితిలోన రగిలినా, కడతేరిపోనిది మధురానుబంధం" అని స్నేహం గురించి ఓ కవిత బాలు చెప్పినప్పుడు రఘుపతి చేతులు కనిపిస్తాయి, అంటే అతను రైటర్ అని, ఈ కవిత రాసేది అతనని మనకు అర్థమయ్యే మెటఫర్ అన్నమాట!!
  4. ఈ తాగుబోతుని కూడా కష్టమైనా ఇష్టంగా భరించే వాడే ఈ రఘుపతి. ఇతను బాలుని ఇంటికి ముందుకు తీసుకెళ్తూ గతంలోకి వెనక్కి వెళ్తాడు. ఇప్పుడు ఇతని దృష్టి కోణంలో మనకి గతం పరిచయమవుతుంది.
  5. అప్పటికే కథకళి, కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్న బాలు ఇప్పుడు కథక్ కూడా నేర్చుకోవాలన్న కోరికతో నాట్య గురువు దగ్గర శిష్యురాలిని ప్రాధేయపడే సన్నివేశం. పైగా, ఇతని దగ్గర డబ్బు లేదని మనకు తెలుస్తుంది. ఎంత డబ్బు లేదు? అని చెప్పేందుకు ఒక ఇంటి ఓనర్ ని చూపిస్తారు. ఆ ఇంటి ఓనర్ కూతురే రఘుపతి కి ఫ్యూచర్లో భార్య, "సుమతి".
  6. మరి ఇంత ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో బాలు ఎందుకు ఎన్ని రకాల నాట్యాలు నేర్చుకోవాలి అనుకుంటున్నాడు?? అనే ప్రశ్నకి సమాధానం బాలు వాళ్ళ అమ్మ ఊరు నుంచి వచ్చి వెళ్ళిపోయే ట్రైన్ సీను. ఆవిడ బాలుకి కాస్త డబ్బు చేతిలో పెట్టి వెళ్తుంటే, "ఆవిడ కష్టపడి సంపాదిస్తుంటే తీసుకోవడానికి సిగ్గు లేదట్రా?" అంటాడు రఘుపతి.. సిగ్గుతో కాస్త ఆవేశం వచ్చి ఆవిడకి డబ్బు వెనక్కి ఇచ్చేసి "సరే నువ్వు చెప్పిన పని చేస్తాను" అని రఘుపతితో ఒప్పుకుంటాడు బాలు. ఏమిటా పని?
  7. ఇది నాకెంతో ఇష్టమైన సన్నివేశం:
  8. రఘుపతి బాలు ని ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఓ ప్రెస్టీజియస్ సినిమాలో క్లబ్ డాన్సులు కూడా లేకుండా హీరో హీరోయిన్లు టింగ్ టింగ్ టింగ్ లు చెయ్యాలి.. "మంచి సాహిత్యం కదా హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైనవి కదా?" అని బాలు మొహమాటపడుతూ ఉంటాడు. కానీ, "పాత్రల పవిత్రతలు ఔచిత్యాలు మనకెందుకు అయ్యా? మనకు కావాల్సింది స్టెప్పులు" అంటాడు డాన్స్ మాస్టర్. అవే కోరుకుంటాడు డైరెక్టర్.
  9. ఇక ఇక్కడ వచ్చే పాట "వేవేలా గోపెమ్మలా..." అనే పాటలో వేటూరి గారి రాసిన సాహిత్యంలో ఈ రెండు లైన్లు చూడండి.."రాసలీలలాడినాడే రాయబారం ఏగినాడే గీతార్ధసారమిచ్చి గీతలెన్నో మార్చనే.." అన్న పదాలకు రొమాన్స్ స్టెప్పులు కోరే  కమర్షియలైజేషన్. ఇప్పటి సినిమాల్లో లాగా మడత పెట్టించడాన్ని ఎప్పుడో ఊహించేశారు విశ్వనాథ్ గారు. 
  10. కానీ డబ్బు కోసం కళని అవమానించినట్టు ఫీల్ అయిపోతాడు బాలు. అది అతని వ్యక్తిత్వం!! తప్పు చేశానని ఖైరతాబాద్ వినాయకుడు ముందు నాట్య విలాసం చేస్తూ ఉంటే రఘుపతి వచ్చి "అంత డబ్బు పెట్టి సినిమా తీసే వాళ్ళకి తెలియదా, నీకెందుకు?" అంటాడు. "డబ్బు వచ్చే ఉద్యోగం ఇప్పించరా అంటే 24 గంటలు చేతిలో విస్కీ బాటిల్ పట్టుకొని ఆ తాగుబోతు దగ్గరికి తీసుకెళ్తావా?" అని అరుస్తాడు బాలు. కట్ చేస్తే ప్రస్తుతం లోకి వస్తాం.. 24 గంటలు తాగుబోతుగా కనిపించే బాలుని చూస్తాం.
  11. కాలాలు మారిన బాలు వ్యక్తిత్వం మారలేదు అని చూపించాడనికి రఘుపతి ఇంటిదగ్గర కృష్ణ పాదాలు కనిపిస్తాయి. "పాపం వదిన కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు రావాలని పాదాలు వేసుకుంటే ఆ దారిలో నేను నడవలేను" అని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు బాలు. కానీ బాలుని బిడ్డలా స్వీకరించిన సుమతి, బాలు దగ్గరికి అన్నం తీసుకొస్తుంది. 


  1. తల్లి మనసుని పరిచయం చేసిన తర్వాత, నాట్య మయూరి తల్లిని పరిచయం చేస్తారు విశ్వనాథ్ గారు. 
  2. కూతురు డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన రివ్యూలు చదువుతూ "పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేలా అభినయించావా?" అని ప్రశ్నిస్తుంది తల్లి. "అదేం లేదు, వాడెవడో తాగుబోతు, "బాలకృష్ణ భాగవతార్" అట,  ఈపాటికి చచ్చిపోయే ఉంటాడు" అంటుంది నాట్య మయూరి. ఆ పేరుతో ఈ తల్లికి ఏదో సంబంధం ఉందని మనకు తెలుస్తుంది.
  3. అన్నట్టు, హీరో పేరు "బాలకృష్ణ భాగవతార్" అని ఎంచుకోవడం వెనుక కర్ణాటక సంగీత త్రయమైన త్యాగయ్య, దీక్షితులు, శ్యామశాస్త్రి తరువాత వాగ్గేయకారునిగా పేరొందిన వారిలో ముత్తయ్య భాగవతార్ గారు అగ్రగణ్యులు కనుక మనకి గుర్తు చెయ్యడం కాబోలు.
  4. ఈలోగా బాలు వల్ల రఘుపతి ఉద్యోగం కూడా పోతుంది, ప్రెస్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి గొడవ చేసి, అక్కడ పడిపోతాడు బాలు. అతను లివర్ ఎంత చెడిపోయిందని, ఇప్పుడు అతను రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే అన్న విషయం మనకి అర్థం అయిపోతుంది. అతని చివరి రోజుల్లో తన జీవితంలో కావాల్సిన శుభ సూచకం "ఈవిడే" అన్నట్టుగా, నాట్యమయురి తల్లి బాలు అడ్రస్ గురించి ప్రెస్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి కనుక్కొని చెప్పమని ప్రాధేయపడుతుంది. ఇప్పుడు ఈవిడ పాత్ర నుంచి ఈవిడ దృష్టి కోణంలో నుంచి గతం మనకి పరిచయం అవుతుంది.
Part III

  1. ఇది కదా విశ్వనాధ్ గారి సినిమాల్లో అసలు సిసలైన హీరోయిన్ ఇంట్రడక్షన్! ఈ రోజుల్లో పొట్టి బట్టలు అమ్మాయిలకి అలవాటు పడిన మనకి అసలు నచ్చదు లెండి, పైగా ఏదో హీరో తో కలిసి నాలుగు స్టెప్పులు వెయ్యడానికే కనిపిస్తున్న హీరోయిన్లు తెలిసిన మనకి, "మాధవి" ఒక ఫోటోగ్రాఫర్ అని, డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఇంతకుముందు "డాన్స్ ఫామ్స్ అండ్ టెంపుల్స్ కల్చర్స్" అని ఒక ఆర్టికల్ కూడా రాసిన, కళని ప్రేమించే అమ్మాయిగా, పరిచయం అవుతుంది.
  2. ఇక బాలు ఈ చిన్న పిల్లాడు "చక్రి"తో పడిన పాట్లు అక్కడ నవ్వించే "భంగిమ" సీన్లు నేను మీకు చెప్పనక్కర్లేదు.
  3. నిజానికి బాలు, అతని తల్లి, మాధవి, ఆవిడ తండ్రి, అందరూ ఒక పెళ్ళికి వస్తారు అందుకనే ఆ ఊర్లో అలా కలుసుకున్నారు. పెళ్లిలో బాలు వాళ్ళ అమ్మగారికి ఫోటోలు చూపిస్తుంది మాధవి. 
  4. అక్కడ బాలు తల్లి మనకి బాలుని సరికొత్తగా పరిచయం చేస్తుంది. "భారతదేశంలో ఉన్న నృత్య సంప్రదాయాలన్నీ నేర్చుకోవాలట. అప్పుడు తను సరికొత్తగా భారతీయ నృత్య పద్ధతిని ఒకటి చేస్తాడట. పిచ్చి తండ్రి." అని బాలు లైఫ్ అంబిషన్ గురించి చెప్తూ అంతటి గొప్పవాడు ఎప్పుడు అవుతాడని ఎదురుచూసే తల్లిని ఒకవైపు, మరోవైపు "బాల.. కనకమయ చేల... సుజన పరిపాల.." అనే ఒక త్యాగరాజ కృతిని పెట్టి అప్పటికే సినిమాలలో .. శంకరాభరణం సినిమాతో పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ అండ్ కూచిపూడి డాన్సర్ "మంజు భార్గవి" గారిని చూపిస్తారు.
  5. ఆవిడ స్టేజ్ మీద నాట్యం చేస్తుంటే ఇక్కడ పంట గదిలో తల్లి ముందు నాట్యం చేస్తాడు బాలు. త్యాగరాజ కృతిలో వచ్చినట్టు "ఏల? నీ దయ రాదు!" అన్నట్టుగా దేవుడి దయ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి. ఇక్కడ ఆవిడ ఊహలో మాత్రమే బాలు మనకి నాట్యం చేసే దుస్తులలో కనిపిస్తాడు.
బాల కనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమాలోల విధృత శరజాల
శుభద కరుణాలవాల
ఘననీల నవ్యవనమాలికాభరణ
ఏలా నీ దయ రాదు?
పరాకు జేసే వేళా సమయము గాదు!

  1. తర్వాత బాలుకి, మాధవికి మధ్య ఉన్న స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని సీట్లు నడిచిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక ఫోటో దిగుదామనుకుంటారు అందులో వాళ్ళు ఇద్దరు కలిసి కనిపించరు. కానీ, అప్పటికే బాలు గురించి ఒక ఆర్టికల్ రాస్తుంది మాధవి.
  2. మాధవి పాత్రలో కూడా ఏదో చేదు గతం ఉందని చెప్పడానికి డాక్టర్ అంకుల్ పాత్ర వస్తుంది. మాధవిలో "చాలా ఉత్సాహం చూస్తున్నాను చాలా మంచి మార్పు కనిపిస్తోంది" అన్న డాక్టర్ అంకుల్ తో బాలు నాట్య ప్రదర్శనని ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ లో పెట్టించమని కోరుతుంది మాధవి.
  3. ఇక తర్వాత వచ్చే సీనులో ఇంట్లో కమల్ హాసన్ గారి నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ "నాద వినోదము నాట్య విలాసము" అనే పాట వస్తుంది. పూర్తిస్థాయిలో బాలు జీవితంలోకి మాధవి రావడం, అతను ఆల్ ఇండియా ఫెస్టివల్ డాన్స్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ఇన్విటేషన్ రావడం, అన్ని శుభసూచకాలే అనుకుంటున్న సమయం కాబట్టి,
భరతమైన నాట్యం బ్రతుకు నిత్యం నృత్యం.. 
నాధ వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరమ
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము.
  1. అనే పాట వస్తే ఇందులో బాలు పరవశించిపోయి పొందిన ఆనందం చూసి మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ మాధవి ఊహలో నాట్య దుస్తుల్లో బాలు కనిపిస్తాడు.
  2. బాలు ఎంతో గొప్ప వాడైపోయినట్టు మాధవికి కూడా అందకుండా ఎదిగిపోయినట్టు,  వాళ్ళిద్దరూ ఓ చక్కని అందమైన కలని కంటారు. ఈ సీన్ ఇక్కడ అవసరమా? అని నేను చాలా సార్లు అనుకున్నాను! కానీ, తర్వాతే తెలుస్తుంది ఇది నిజం కాని కల అని. మనం ఒకటి తెలిస్తే విశ్వనాథుడు మరొకటి తలచి తలరాతలు మార్చేశాడు. జీవితాన్ని మలుపు తిప్పే కష్టాలు మనసుని గాయపెట్టే పరిస్థితులు, "శివుడి నయన త్రయలాస్యం" అన్నచోట తల్లి మరణించడం, ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ కలగానే మిగిలిపోవడం!
  3. ఇలాంటి సమయంలో కాస్త స్ఫూర్తిని ఇవ్వటానికి మాధవి రఘు రాసిన "మౌనమేలనోయి" అనే పాటకి కొత్త ట్యూన్ కట్టి బాలుకి వినిపిస్తుంది. పైగా "రఘు బాగా రాస్తారు నేను పాడతాను, మీరు నాట్యం చేసేలా మన ముగ్గురం కలిసి ఆల్ ఇండియా టూర్ చేయొచ్చు కదా" అని ప్రపోజ్ కూడా చేస్తుంది. 
  4. అక్కడ కొత్త ఆశలు రేగిన బాలు "ఎప్పటికీ మీరు నాతోనే ఉంటారా?" అని లవ్ ప్రపోజ్ చేసేస్తాడు. రఘు-సుమతీల పెళ్లి కార్డు పట్టుకొని ఓ గులాబీ పువ్వు ని మాధవికి ఇస్తాడు. ఇక్కడ ఈ గులాబీ ది కూడా చాలా ముఖ్యమైన పాత్ర! మాధవి తలలో పెట్టుకోవాలనుకున్నప్పుడు అది కింద పడిపోతుంది! అంటే, ఆ ఫోటో లో కలిసి పడినట్టే, వీళ్ళిద్దరూ కలవరు అని ఎప్పటికప్పుడు విశ్వనాథ్ గారు మనకి చెప్తూనే ఉన్నారు.

  1. అదే సమయంలో బాలు, మాధవి ఒకరినొకరు మౌనంగా ఇష్టపడుతున్నారు అని చెప్పేందుకు "ఎదలో వెన్నెలా, వెలిగే కన్నులా, తారాడే హాయిలో.. మౌనమేలనోయి?" అన్న పాట వస్తుంది.
  2. బాలు చాలా డీసెంట్ అయినవాడు కాబట్టి మాధవి తండ్రికి కూడా వెళ్లి ఈ విషయాన్ని చెప్తాడు. తండ్రి ద్వారా మాధవికి ఇంతకుముందే పెళ్లి అయిపోయిందని, భర్త వదిలేసాడు అన్న విషయం బాలుతో మనకు కూడా తెలుస్తుంది.
  3. మళ్లీ బీచ్ దగ్గర నాట్య విలాసం చేస్తున్న బాలు దగ్గరికి తలలో తను ఇచ్చిన రోజా పువ్వు పెట్టుకుని వెళుతుంది మాధవి. అంటే మాధవి బాలు ప్రేమని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అని, పరుగున వెళ్తున్న సమయానికి, తన భర్త వస్తాడు. 
  4. ఆ భర్త మాధవిని బాలుని కలిపి, కెనడాలో స్థిరపడిపోవాలనుకుంటాడు.. మాధవి భర్త మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు అని తెలుసుకున్న బాలు మాధవి భర్త తోనే ఉంటే సుఖపడుతుందని తన ప్రేమని త్యాగం చేసి ఆవిడని ఒప్పించే ఇద్దరినీ కలుపుతాడు. ఇక్కడ మాధవి తన తల నుంచి రోజా పువ్వు తీసి పక్కన పెట్టేస్తుంది.
  5. తన పక్కన ఫోటోలో కూడా పడలేని బాలు, మాధవి ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మాధవిని తన భర్తని కలిపి ఒక ఫోటో తీసుకుంటాడు. 
  6. అప్పుడు అలా కెనడా వెళ్లిపోయిన మాధవి ఇప్పుడు మళ్ళీ ఇలా  హైదరాబాద్ కి వచ్చి ప్రస్తుతం లో మనకి కనిపిస్తుంది, రఘు ఇంటికి అడ్రస్ తెలుసుకుని వస్తుంది.
  7.  జీవితంలో తట్టుకోలేని సంఘటనలు జరిగినప్పుడు స్వయంకృషి సినిమాలో సాంబయ్య లాగా లక్షంతో ఎదిగిపోవచ్చు, కాన తన గురించి కలలు కన్న తల్లి చనిపోయాక, స్ఫూర్తి  ఇస్తుందనుకున్న అమ్మాయి వెళ్లిపోయాక, "ఎందుకు బతకాలో తెలియని తికమకలో, తనకి ఎంతో ఇష్టమైన నాట్యం కూడా పక్కన పెట్టేసి తాగుబోతు అయిపోయాడు బాలు.


  1. మరి ఇలాంటి పాత్రని తిరిగి మామూలు మనిషిని చేయడానికి ఎలాంటి మనిషి రావాలి? భర్త వదిలేసినప్పుడు ఇంట్లో ఒక మూల కూర్చోకుండా తనకి తోచిన పద్ధతిలో కళకి సేవ చేస్తూ రివ్యూస్ రాసిన అమ్మాయే రావాలి! భర్త చనిపోయిన తర్వాత తన కూతుర్ని "నాట్య మయూరిగా తీర్చిదిద్దాలనుకున్న, స్థిరమైన పట్టుదల ఉన్న తల్లే రావాలి! అందుకే అడ్రస్ తెలుసుకుని మరీ వస్తుంది, మాధవి.
  2. 364 రోజులు తాగే బాలు మాధవి భర్తని కలిసిన రోజున ఆ దంపతులు సుఖంగా ఉండాలని అభిషేకించడానికి మాత్రమే బతికి ఉన్నాడు. అలాంటివాడు ఇప్పుడు విధవగా మాధవిని చూసి తట్టుకోగలడా?? మళ్లీ స్ఫూర్తి నింపాల్సిన మాధవి తిరిగి బాలు జీవితంలోకి వస్తే ఎలాంటి పరిస్థితిలో కనిపించాలి?
  3. అని చూపించడానికి బాలు బావి మీద తాగి అన్నమయ్య పాట పాడుతూ తూగుతూ "తడబడి అడుగుల"తో వేసే తికమక నాట్య కృత్యాలు చూస్తూ "ప్రసవ వేదన" అనుభవిస్తూ విధవ అయినా, అతని కోసం కుంకుమ పెట్టుకుని కనిపిస్తుంది మాధవి. 
"అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ"

అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట
పల్లవించు పద కవితలు పాడి!
  1. అప్పుడే జోరున వర్షం ఆ వర్షంలో తన కుంకుమ పోకూడదని చెయ్యి అడ్డు పెడతాడు బాలు. అంటే రఘు చెప్పినట్టుగానే మాధవి ఎప్పుడు నిండు ముత్తయిదువగా కనిపించాలి అనుకునే కోరిక ఉన్నవాడు బాలు. 
  2. కానీ, తల్లిని బొట్టుతో చూసిన "నాట్యమయురి", "బాలు నాకు గురువేనా? ఇంకేమన్నా అవుతాడా?" అని ప్రశ్నిస్తుంది.
  3. మాధవి అప్పుడు "గురు బ్రహ్మ! గురు విష్ణు! గురు దేవో మహేశ్వర!" అని సమాధానం ఇస్తూ అతనికి తనకి ఉన్న సంబంధం ఎంత పవిత్రమైనదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా వినదు నాట్య మయూరి, తనకోసం మాత్రం కిషోర్ ని వెతికేసుకుంటుంది.
  4. అక్కడ నాట్య మయూరి మాధవి కూతురు అని తెలిసి తను తాగుడు మానేస్తానని మాట ఇస్తాడు బాలు.
  5.  మాటిస్తే సరిపోతుందా పరిస్థితి అనుకూలించవద్దు? తన భర్త ఆర్థికం గురించి తెలుసుకున్న బాలుకి నిజం తట్టుకునే శక్తి లేక పడిపోతాడు. 
  6. రఘు వెళ్లి నాట్యమయురిని పట్టుకొస్తాడు. "నా దగ్గర మాధవి విషయం ఎందుకు దాచారు నేను బ్రతికి ఉంటే ఎవరికీ ప్రయోజనం, చచ్చిపోతే ఎవరికి నష్టం?" అని అడుగుతాడు బాలు.
  7. "ఏ కళైనా దేవుడు నుంచి సంక్రమించే గొప్ప వరం! నీకు తెలిసిన నాట్యాన్ని, అభ్యసించే వరాన్ని నువ్వు నీ చేతులతోనే చంపేస్తుంటే మాధవి చూడలేకపోయింది, శైలజని నీ వారసురాలుగా నిలబెడితే నువ్వు చిరంజీవివి అవుతావని ఆశపడింది" అని చెప్తాడు రఘు.
  8. "నాలో ఉన్న కళ నాతో పాటు చచ్చిపోకుండా ఉంటుందని చూసే నేను చచ్చిపోతాను" అని బాలు మాధవికి మాట ఇచ్చి, శైలజ కి నాట్యం నేర్పిస్తాడు.
  9. డాక్టర్ అంకుల్ హాస్పిటల్ కి విరాళాలు ఇచ్చిన మాధవి, "అది నలుగురికి ఉపయోగపడాలని  ఇచ్చాను కానీ నలుగురు చేత ప్రశంసలు పొందడానికి కాదు" అని చెప్తూ "అయినా నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు! బాలకృష్ణ గారి తల్లి ఆయనలో ఉన్న కళని ప్రదర్శించటం చూడకుండానే పోయారు నేను అలా కాకూడదన్న స్వార్థం తో వచ్చాను" అంటుంది.
  10. "మాధవి గారు చెప్పిన బాలుని నేనే" అని పరిచయం చేసుకుంటున్న బాలుకి, ఊహలో కాకుండా ఈసారి నిజ జీవితంలో మొదటిసారిగా, చివరిసారిగా ప్రేక్షకుల నుంచి చప్పట్లు వినపడతాయి. 
  11. "కుమారి శైలజా నృత్యం లో నా కళ్ళని ప్రదర్శింప చేయాలనుకున్న మహాతల్లికి నమస్కారాలు" అంటూ మాధవికి చేసిన నమస్కారం తో శైలజలో కూడా మార్పు వస్తుంది.
  12. ఇక చివరిగా వచ్చిన పాటలో మాధవి కంటికి మళ్లీ బాలకృష్ణ, పూర్తిస్థాయిలో నాట్యం చేసే వాడిలా కనిపించినా అక్కడ వచ్చే లైన్స్ మనం గమనించాలి!
  13. "నటరాజ పాదాల తల వాల్చనా" అని వచ్చేస్తుంది... శైలజ నృత్యం చూస్తూ ఆనందిస్తున్నా ఈ మూడు ముఖ్య పాత్రలు ఇప్పుడు కలిసిన చోట 
“సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిరనర్తనమాయె!” 
అని వచ్చి
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ||
అని భర్తృహరి నీతిశతకము లో శ్లోకం వస్తుంది.
తాత్పర్యము: ఎవరైతె విషయ పరిఙ్ఞానమును పొందారో, మంచి పనుల చేత సిధ్ధులయ్యారో, వారియొక్క కీర్తికి ముసలితనము, మరణము వలన కలిగె భయము లేదు.
  1. రస ప్రవాహంలో కలిసిన బాలుని తిరిగి తీసుకెళ్లేటప్పుడు అతని వీల్ చైర్ నుంచి శైలజ పాదాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇది మరో మేతఫోర్! నాట్యం కొనసాగుతోంది అని చూపించడం అన్నమాట! 
  2. ఇక్కడ మళ్ళీ వర్షం ఎపిసోడ్ రిపీట్ అవుతుంది. రఘు బాలు మీద వర్షం పడకుండా ఆపుతూ ఉంటాడు, మాధవి గొడుగు పట్టుకొచ్చి కళాకారుడిని తడవకుండా చూసుకుంటుంది.
  3. సినిమాలో పాత్రలు మన కళ్ళముందే ఎదిగిపోతూ ముందుకు వెలిగిపోతాయి. "సాగర సంగమమే ఒక యోగం" అన్న పదానికి అర్థం చేకూరుతుంది.
  4. "There is no end for any Art" అని చెప్పి ఈ విశ్వనాథ్ గారు ఆ రోజులలో ఈ సినిమాని చూసిన ప్రేక్షకులందరికీ చెప్పారు. 
  5. ఈరోజున ఈ సినిమాని నాతోపాటు చూసిన మీ అందరికీ నేను ఒక్క విషయం చెప్తాను: మనకి వీలైనప్పుడు ఒక కూచిపూడి నృత్య ప్రదర్శన కి వెళ్దాం, వీలు చేసుకుని త్యాగరాజ, అన్నమయ్య కీర్తనలు అర్థంతో సహా తెలుసుకుందాం, మన భాషను కాపాడుకుంటూ తర్వాత తరాలలో కూడా ప్రవహింప చేద్దాం! అప్పుడే విశ్వనాధ్ గారు చెప్పిన కళలు బ్రతుకుతాయి. లేకపోతే పరభాష వారు తెలుగు ని ఉద్ధరించే ప్రయత్నంలో విరగ్గొట్టి పాడుతుంటే, మనకి. వినక తప్పక, మనమే విమర్సించుకునే గతి పడుతుంది.
నా Instagram ప్రొఫైల్ ని మీరు ఫాలో అయ్యే ఇక్కడకి వచ్చి ఉంటారు:
అక్కడే త్యాగయ్య / అన్నమయ్య కీర్తనలు అర్ధాలతో పెడుతున్నాను.
https://www.instagram.com/lens.of.amruta



Comments