స్వర్ణకమలం : “కొలువై ఉన్నాడే” పాటకీ తంజావూరు రాజుకి సంబంధం ఏమిటి?

కథానాయిక భానుప్రియ తండ్రి ఒకప్పుడు నటరాజుకి మారుపేరుగా బ్రతికిన నాట్య గురువు “వేదాంతం శేషగిరి శర్మ” గారు. అనారోగ్యం, పరిస్థితుల వలన కంటి చూపు పోయి నిస్సహాయుడు అయితే, పెద్ద పిల్ల సంగీతం నేర్చుకుని కుటుంబం భారాన్ని మోస్తుండగా, మన కథానాయిక సినిమాలని, షికారులని నాట్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది. వారిది ఎంత పాండిత్యం ఉన్న కుటుంబమో ఈ పాట ద్వారా చెప్తూనే మన నాయిక నిర్లక్ష్యాన్ని చూపిస్తారు విశ్వనాధ్ గారు ఈ పాటలో. అలంటి పాట ఎదో సినిమా కోసం రాసిన పాట కాకుండా ఒకప్పుడు తంజావూర్ రాజుగారి సాహిత్యాన్ని పాటగా ఎంచుకున్నారు. వివరాలు చూద్దామా?


పాటలో శ్లోకం : కంఠే నావలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శనేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్

అర్ధం : గీతం, కంఠం (గొంతు) నుంచి వస్తుంది, చేతులు, (హస్తం) అర్ధాన్ని చూపిస్తాయి, కళ్ళు (చక్షుభ్యాం) భావాన్ని చెప్తాయి, పాదాలు (పాదాభ్యాం) తాళానికి ఆడతాయి.

"కొలువై ఉన్నాడే దేవ దేవుడు" అని మొదలయ్యే పాటలో కొలువై ఉన్నది ఏ దేవుడు?

పాటలో కొన్ని పదాలు :కొలువైవున్న దేవదేవుడు, వనిత మొహనాంగుడు, పాలుగారు మోముగలవాడు, అలవేలు, శ్రీలు” చూస్తే, అలంకార ప్రియుడు, శ్రీమహా విష్ణువు పాటేమో అనిపిస్తుంది. కానీ, వలరాజు పగవాడూ, నెలవంక, పులి తోలు కట్టిన వాడు అంటే శివుడు కదా !

సరే పాట సాహిత్యం : పాట అర్ధం – పాట వెనుక చరిత్ర తెలుసుకుందాం ->

పల్లవి : కొలువై ఉన్నాడే దేవ దేవుడు, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

అర్ధం: కోటి సూర్య తేజస్సు తో కొలువై ఉన్నాడు దేవుడు. మన్మథుడిని మూడో కంటితో శివుడు భస్మం చేసాడు కాబట్టి వలరాజు/ మన్మధుడు పగవాడు అయ్యాడు. బూడిద పూసుకున్నా కూడా అమ్మవారికి సుందరాంగుడే కదా. 

చరణం 1: పలుపొంకమగు చిలువల కంకణములమర నలువంకల మణిరుచుల వంక తనర తలవంక నలవేలు పులవంక నెలవంక వలచేత నొక జింక వైఖరి మీరంగ || కొలువై ||

అర్ధం: కొన్ని పాములు శివుడి చేతులకి కంకణాలుగా చుట్టుకుని నాలుగు వైపులా మణి కాంతులు వెలిగాయి.  తలమీద గంగతో, పసుపు పచ్చ నెలవంకతో, కుడి చేతిలో జింకతో తీరుగా బయలుదేరిన శివుడు. 


చరణం 2: మేలుగ రతనంబురాలు చెక్కిన ఉంగరాలు భుజగ కేయురాలు మెరయంగ. పాలుగారు మోమున శ్రీలు పొడమ పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి చెలగా || కొలువై ||

అర్ధం: శివుడిపై మంచి రత్నాలతో చెక్కిన ఉంగరాలు భుజ కీర్తులు మెరుస్తున్నాయి. పాలు కారే తెల్లని మోహములో సంపద పొంగే వెలుగు ఉండగా, పులి చర్మం కట్టుకుని శివుడు త్రిశూలంతో బయలుదేరాడు.




చూసారుగా, పాటంతా మన తెలుగులో ఉన్నా అంత సులువుగా అర్ధం అయ్యే పదాలు లేవు ఎందుకు ? సిరివెన్నెల గారు అంత క్లిష్టమైన పదాలతో ఈ సినిమాకి ఎందుకు రాశారు? అసలు రాసినది ఆయనేనా? ఇది సినిమాకి రాసినదేనా?
కాదు బాబు కాదు!
17 వ శతాబ్దంలో తంజావూరుని పాలించిన మరాఠి రాజు ఐన శాహాజీ మహారాజ్ రాసిన "పల్లకి సేవా ప్రబంధం" అనే నృత్య నాటకంలో "శంకర పల్లకీ సేవా ప్రబంధం" నాటకం లో శంకరాభరణ రాగంలో  త్రిపుట తాళంలో పాటే ఈ "కొలువై ఉన్నడే". శాహాజీ మహారాజ్ మాతృ భాష తెలుగు కాదు, అయినా అప్పటి ఆస్థాన భాష తెలుగు కాబట్టి తెలుగు భాషను నేర్చుకుని, పాండిత్యంతో రచనలు చేశాడు. ఆయన రాసిన ఆ పాటని ఈ విధంగా విశ్వనాథ గారి సినిమాలో సిరివెన్నెల గారు కొన్ని మార్పులు చేసి మనకి అందించారు. ఇక ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో, ఎస్. పి. బాలు గారు, పి. సుశీల గారు పాడిన ఈ పాట తెలుగు సినిమాలో ఆణిముత్యం అయ్యింది. 

ఈ రాజు గురించి ఇంకొన్ని వివరాలు, నృత్య నాటకం వివరాలు, పాటలో పాదాలకి అర్ధం ఇక్కడ ఉన్నాయి, వీలుంటే చుడండి: https://resorcio.com/products/the-meaning-of-the-song-koluvai-unnade

ఇదే సినిమాలో మరో పాటకి సిరివెన్నెల గారు భగవత్ గీత సారాన్ని పెట్టారు, అదే ఏ పాటు గెస్ చెయ్యండి, రాశాక షేర్ చేస్తాను.


Comments