పొన్నియిన్ సెల్వన్ రాజు అవ్వకుండా మావటివాడు అయ్యిన కథ!
"ఏంటి సినిమా అంత బాగుందా ఖచ్చితంగా చూడాలా? " అని మీరు అడిగితే "మీ ఇష్టం" అని చెప్తాను ఎందుకంటే ఇది అంత గొప్పగా లేదు అలా అని చెత్తగా కూడా లేదు. టిపికల్ #Maniratnam స్టైల్ లో ఉంది. మరి నేను ఎందుకు చూశాను అని అంటే, వానలు ఎక్కువై కరెంటు పోతుంది కదండీ! ఏదో టైం పాస్ కి వెళ్లాను. పైగా ఇంకే సినిమాలు చూసేలా లేవు కదా. ఇది అరవ సినిమా అయినా మన చరిత్ర ఉంది కదా. పైగా అన్ని రాడ్ సినిమాలు అస్సాం సినిమాలు అంటున్నారు. అందులోనూ నేను వెళ్ళింది ఒక తమిళియన్ తో అందుకే కొన్ని పాయింట్లు నచ్చాయి, అదే, అర్థమయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ గురించి కూడా నేను ఒక రివ్యూ రాసేసాను (https://telugutarangam.blogspot.com/2022/10/tokachukka.html) మీరు అక్కడ చదవచ్చు, అవసరమా? అనుకుంటే ఇక్కడే షార్ట్ గా చెప్తాను.మనం చిన్నప్పుడు చదువుకున్న రాజరాజ చోళుడి ఫ్యామిలీ స్టోరీ ఇది. చోళులకు పాండ్యులు శత్రువులు. చోళుల యువరాజుల్లో పెద్దవాడు ఆదిత్య కరికాలుడు (హీరో విక్రమ్), అతని తమ్ముడు అరుణ్ మోళి, అదే రాజరాజ చోళుడు - అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి), వీళ్ళ మధ్యలో ఒక అమ్మాయి కుందవై (త్రిష), వీళ్ళ తండ్రి సుందర చోళుడు, ప్రకాష్ రాజ్ గారు. చోళులను కాపాడే బాధ్యత ఒక కుటుంబానికి ఉంది. ఆ కుటుంబానికి చెందిన వాడు వల్లవరాయుడు, మన కార్తి. ఆ రోజుల్లో ఎంతోమంది సామంత రాజులు కూడా ఉండేవారు. వాళ్లలో ఒకరు పెద్ద వలవేట రాయుడు (శరత్ కుమార్), రాజుగారి ఖజానా చూసేవాడు. ఈయన మన చోళ యువరాజులకి తాతగారు. ఈ తాత గారి భార్య నందినీ దేవి, సౌందర్య రాసి, ఆదిత్య కరికాళుడి ఒకప్పటి ప్రేయసి. ఆమె చోళుల నాశనం కోరుకుంటుంది. అందుకే చోళుడు, ముసలివాడు అయినా పెద్ద వలవేట రాయుడుని వివాహం చేసుకుంది.
పార్ట్ వన్ నుంచి మనకి తెలియాల్సిన సమాధానాలు:1. నందిని చోళుల నాశనం ఎందుకు కోరుకుంటుంది?
2. నందిని ఆదిత్య కరికాళుడు ఎందుకు విడిపోయారు.
3. పొన్నియిన్ సెల్వన్ సముద్రంలో మరణించాడా?
4. పొన్నియిన్ సెల్వన్ ని ఎప్పుడూ కాపాడే నందిని లాంటి ముసలి ఆవిడ ఎవరు?
5. చోళుల యువరాజుల్లో పెద్దవాడు, ఆదిత్య కరికాళుడు రాజు అవ్వకుండా అతని చిన్నాన్న మధురాంతకుడు సామంతులతో చేతులు కలిపాడు. అతను రాజు అవుతాడా?
ఈ నేపథ్యంలో రెండవ పార్టు ప్రారంభమవుతుంది.
చిన్నతనంలో ఆదిత్య కరికాలుడు - నందిని ప్రేమికులు. రాజమాతకి విషయం తెలిసి నందిని అనాధ కాబట్టి, నందినిని వెళ్ళగొడుతుంది. నందిని తల్లి, తనలాగే ఉండే మూగ ఆవిడ, మందాకిని, అడవుల్లో ఉంటుంది. నందినిని ఒక గుళ్లో అనాధలా వదిలిపెట్టిందట. ఆవిడ ఒక సమయంలో చోళుల తండ్రి, సుందర చోళుడికి సన్నిహితురాలు. ఆ అభిమానం తో సుందర చోళుడి కొడుకు, పొన్నియిన్ సెల్వన్ ని కావేరి నదిలో ఎప్పుడు ఆపద వచ్చినా కాపడుతుంది. మరి నందిని తండ్రి ఎవరు? సుందర చోళుడేనా? అలా అయితే నందిని ఇంకా ఆదిత్య కరికాళుడు అన్నాచెల్లెళ్లు అవుతారు కదా? ఇది కథలో మలుపు.
ఇలా ఉండగా మరోవైపు పొనియిన్ సెల్వన్ బ్రతికే ఉంటాడు. అతనికి చికిత్స ఇప్పిస్తాడు వల్లవరాయుడు. ఈ పోనియిన్ సెల్వన్ ని కాపాడింది నందినిలా ఉండే ఆ ముసలి మనిషే అని తెలిదుకున్న కుందవై తన తండ్రి సుందర చోళుడిని అడుగుతుంది. నందిని తన సోదరి అని పోరబడుతుంది. రాజమాత అది నిజమే కాదని నిర్ధారిస్తుంది. నిజానికి సుందర చోళుడు ఇష్టపడిన అమ్మాయిని లొంగదీసుకుంటాడు శత్రువు ఐన వీర పాండ్యూడు(నాజర్ గారు), ఇది పాండ్యులకి మాత్రమే తెలిసిన నిజం. అలా పుట్టిన పిల్లే నందిని. కానీ ఎవరూ చేరదీయక అనాధ అవుతుంది. అప్పుడు వీరపాండ్యుడు నిజం చెప్పకుండా చేరదీసి తనలో పగ తో కూడిన క్రోధాగ్నిని వెలిగిస్తాడు. ఆ తరువాత నందిని కళ్ళ ముందే ఆదిత్య కరికాలుడు వీర పాండ్యుడిని చంపటంతో చోళుల నాశనం కోరుకుంటుంది నందిని. వీర పాండ్యుడు మరణిస్తూ తన కొడుకు బాధ్యతని నందినికి వదిలేస్తాడు.
కథ చెప్పేస్తున్నాను అనుకోకండి, ఇందులో ఇంకా మలుపులు ఉన్నాయి.
చోళుల మీద ప్రతీకారం తీర్చుకొని వీర పాండ్యుడి కొడుకుని రాజుని చేయడమే నందిని లక్ష్యం, తనకి సింహాసనం అధిష్టించాలని కాంక్ష పుట్టింది, ముసలివాడు అయిన పెద్ద వలివేట రాయుడిని పెళ్లి చేసుకుంది. పొన్నియన్ సెల్వన్ ని చంపించే ప్రయత్నం చేసింది కానీ అతను బ్రతికేశాడు. కాబట్టి మళ్లీ పాండ్యులందరూ కలిసి పన్నాగం పన్నుతారు. ఒకేసారి పౌర్ణమి రోజున 1. ఆదిత్య కరికాళుడిని, 2. పోనియన్ సెల్వన్ ని, వీళ్ళ తండ్రి 3. సుందర చోళుడుని చంపేద్దామని వ్యూహం చేస్తారు, అది మన వల్లవరాయుడు వినేస్తాడు.
1. నాగపట్నం లో పొన్నియిన్ సెల్వన్ కి బౌద్ధ మతస్థులు చికిత్స చేస్తుండగా ఏనుగు అంబారీ తో చంపించె వ్యూహం, అది అతను తప్పించుకున్నతీరు సినిమాలో చూడాల్సిందే! 2. అదే సమయంలో సుందర చోళుడి పైన దాడి, మందాకినీ వీర ప్రేమ గాధ కూడా బాగుంది. 3. ఇక ఆదిత్య కరికాలుడిని చంపే భాద్యత స్వయంగా నందినిది. వీళ్ళ ప్రేమ గెలుస్తుందా? పాగా గెలుస్తుందా? అనే ఉత్కంఠత తో సన్నివేశం బాగుంది.
1. నందిని పగ చల్లారిందా? చివరికి నందిని ఏమయింది? తన తండ్రి ఎవరో తెలుసుకుందా? తల్లిని కలుసుకోగలిగిందా? నిజం తెలిసి తనలో మార్పు వస్తుందా? 2. ఆదిత్య కరికాళుడు ఏమయ్యాడు? పోనియిన్ సెల్వన్ సామంతులని ఎదుర్కొని రాజు ఎలా అయ్యాడు? పాండ్యూల శత్రుశేషం లేకుండా చేశాడా?
3. మధురాంతకుడు మరోవైపు చోళ రాజ్యానికి రాజు అవుదాం అనుకుంటున్నాడు అతను ఏమయ్యాడు? చోళ రాజ్యాన్ని చీల్చాడా, చోళులతో కలిశాడా?
4. వల్లవరాయుడు యువరాజులకి తోడుగా ఉండి వాళ్ళని కాపాడి తన బాధ్యత నిలబెట్టుకున్నాడా? కుంధవై తో కలిశాడా? కుట్రల గురించి ముందు నుంచి పసిగడుతున్న కుంధవై ఏం చేయగలిగింది?
ఒక కథలా దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇందులో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఇంకెన్నో పాత్రలు ఉన్నాయి. ఆనాటి రాజుల కాలంలో పొన్నియిన్ సెల్వన్ రాజరాజ చోళుడుగా ఎన్నెన్నో గొప్ప పనులు చేశాడని చరిత్రలో నిలిచిపోయాడని మనకి తెలుసు. తమ పక్కన ఉన్న స్నేహితులే వెన్నుపోటు పొడిచిన సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. విక్రమ్ గారి పాత్రని నెమ్మదిగా తగ్గించి పొన్నియన్ సెల్వన్ ని ఎలివేట్ చేశారు. అది బాగుంది. పార్ట్ వన్ లో ఆదిత్య కరికాలుడికి - నదినికి మధ్య పగ ఇందులో సిల్లీ చేశారు. అసలు పగే నాకు కనిపించలేదు. ఇక ప్రభు గారి క్యారెక్టర్ ఎందుకు ఉందొ తెలియదు. అది నవల లోని పాత్రే అనుకోండి, కానీ అన్ని పాత్రలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి పిచ్చి ఎక్కుతుంది.
అదండీ సంగతి! ఇది తమిళనాట గొప్ప నాన్ డీటెయిల్డ్ బుక్ అని విన్నాను. వాళ్లకి "ఇది మా గొప్ప నవల" అని గొప్పగా అనిపించొచ్చు, మనకి అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ సినిమాటోగ్రఫీ, కొన్ని స్టాంట్స్, రెహమాన్ మ్యూజిక్, వార్ సీన్లు, కొన్ని ట్విస్టులు, ఐశ్వర్య రాయ్ వైభవం, కార్తీ, జయరాంల కామెడీ, కార్తీ త్రిషాల ప్రేమ కథ బానే అనిపిస్తుంది.









Comments
Post a Comment