సరిగ్గా సంవత్సరం ముందు...

The Day Destiny Smiled: The Return of a Positive Thought

సంవత్సరం ముందు ఏమి జరిగిందో చెప్పే ముందు మీకు కొన్నేళ్లముందు ఏమి జరిగిందో చెప్పాలి...

అవి నేను "భవసాగరాలు" అనుభవించే రోజులు. అంటే సుమారు 2015 వ సంవత్సరంలో అనుకోండి. కష్టాలు నాకే వస్తాయనీ, దేవుడు నన్నే శిక్షిస్తాడనీ, దేవుడిని తిట్టుకుంటూనే, నన్ను కష్టకాలం నుంచి కడలికి చేర్చమని అర్థించేదాన్ని. సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళే దారిలో మారేడ్పల్లి వైపు ఒక శివాలయం ఉంది. అక్కడనుంచి వెస్ట్ మారేడ్‌పల్లి వెళ్తుంటే ఒక కిలోమీటరు దూరంలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఈ రెండు గుళ్లకి నేను తారచుగా వెళ్ళేదాన్ని. కొన్ని కష్టాలు చెప్పుకుంటే పోతాయని అంటారు, పోతాయో లేదో కానీ ఒకళ్ళకి చెప్పుకుంటే భారం అయినా తగ్గుతుంది. ఎవరికి చెప్పుకోను? తల్లి తండ్రులు కూడా విసికిపోయారు, వాళ్లకి తెలియనిది కాదు, ఐతే వాళ్ళు కూడా ఏమి నిర్ణయించలేని పరిస్థితి. ఇక దేవుడే దిక్కు అనుకున్న రోజులు అవి. గుడికి వెళ్లి నేను ఏడవని రోజు లేదు. అప్పట్లో కన్నీళ్లతో దేవుడికి అర్పించిన శోఖాభిషేకాలు ఎన్నో. ఇప్పుడు చెప్పుకుంటుంటే ఒక వైపు ఆ రోజులు గుర్తుకు వచ్చి బాధ అనిపించినా మరో వైపు మరీ పిరికిగా ఉన్నానా అనిపిస్తుంది. ఎంత ఫలానికి అంత తీపి అన్నట్టు, ఈ జన్మకి నేను అనుభవించాల్సిన కర్మ ఉంటే తప్పించుకోగలనా?

Chapter 1: Seeking Inspiration: 

ఫేస్బుక్ లో దొరికిన ధైర్యం 

నేను ఫేస్‌బుక్ వచ్చినప్పటినుంచి, అంటే 2009 నుంచి, దాన్ని తెగ వడిన వాళ్లల్లో ముఖ్యురాలిని. అందులో "బాపు రమణ" (https://m.facebook.com/Bapu.Ramana/) పేజి స్టార్ట్ చేసి రన్ చేస్తు ఉండేదాన్ని. అదే నాకు ఎన్నో సార్లు ఊరటని ఇచ్చింది. ఇక నాకు నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వటం, నేను తెలిసిన వాళ్ళతో ఆన్లైన్ గేమ్స్ ఆడటం, అప్పట్లో Hollywood స్టార్ Sandra Bullock ఫేస్బుక్ పేజీ కూడా రన్ చేసే వాళ్ళము, నేనూను, ఇంకో Philippines అమ్మాయిను. ఇప్పుడు ఆ పేజీ ఏమైయిందో, ఆ అమ్మాయి ఎక్కడ ఉందొ తెలియదు. సరే, 2015 నుంచి నేను ఫేస్‌బుక్ వాడటం తగ్గించేశాను. నాకు తెలిసినవాళ్లే నన్ను చూసి నవ్వుతున్నారు అనిపించింది. ఒకవైపు రక్షించడానికి తాడూ వేసి లాగుతూనే మరో వైపు ఆ తాడుని తెంపుతున్నారు అనిపించింది. పైగా నా జీవితంలో ఆనందించేలా పది మందికి పంచుకునే విషయాలు ఏమి లేవు. అన్నీ దుఃఖలే. ఇంకొంతమంది వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవారు, వారి జీవితంలోనే సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో ఇక నాగురించి తెలుసుకుంటారా? తెలుసుకున్నా తీరుస్తారా? అందుకే ఫేస్బుక్ లో పోస్ట్లు ఆపేసాను. అప్పుడే నాకు "ఆవిడ" ప్రొఫైల్ కనిపించింది.

Chapter 2: A Silent Prayer

ఆవిడ దూరదర్శన్ టీవీ సీరియల్స్ లో పనిచేసిన ఒక ప్రముఖ నటి, రచయిత, పేరు చెప్పచ్చో లేదో (ఎందుకంటే ఈ పోస్ట్ ఆవిడ గురించే), ఇంకెప్పుడైనా చెప్తాను లెండి. కొన్న సినిమాల్లో కూడా సైడ్ క్యారెక్టర్గా కనిపించారు. ఆవిడ ఫేస్బుక్ పేజీ లో ఆత్మ విశ్వాసం, సమాజం పట్ల బాధ్యత, లాంటి కొన్ని పోస్ట్లు చూశాను. ఆవిడని ఫాలో అవుతూ ఉండేదాన్ని . ఒకసారి వాళ్ళ ఏరియా చెత్త గురించి ఆవిడ ఆందోళన ప్రకటిస్తూ రాసారు. అప్పుడు తెలిసింది ఆవిడ ఉండేది ఈస్ట్ మారేడ్పల్లి లో అని. నేను ఉన్న దయనీయ స్థితిలో అప్పుడు ఆవిడను వెళ్లి కలిసేద్దామా అనిపించింది. పైగా నేను కూడా అప్పట్లో మారేడ్పల్లి లోనే ఉండేదాన్ని. ఐతే "ఆవిడను అడ్రస్ అడుగుదామా? వెళ్లి ఒకసారి కలుద్దామా? పోనీ మారేడ్‌పల్లి వీధుల్లో ఆ మున్సిపాలిటీ చెత్త ఉన్న ఫోటో తీసుకునే నేనే వెళ్లి వెతకానా? ఆవిడని కలిస్తే, నా కష్టాలు విని నన్ను పిరికిదాన్ని అనుకుంటారా? ఫేస్బుక్ లో పెడితే? తొందర పడుతున్నానా? ఆలోచన లేకుందా మతిచెడి ఉన్నానా?" ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి.

ఆగని ఆగనము

తీరా నేను ఆవిడను కలిసింది లేదు కానీ, ఆవిడ పోస్ట్లు చూడటానికే ఫేస్బుక్ తెరిచే దాన్నీ, కానీ దేవుడు తప్ప నన్ను ఆదుకునే నాథుడు ఎవ్వరు లేరు అనిపించింది. ఫేస్బుక్ అన్‌ఇన్‌స్టాల్ చేసేసాను. అసలు Facebook profile delete చేద్దాం అనుకున్నా, బాపు రమణ పేజీ వలన ఉండనిచ్చాను . రెండవ మనిషితో మానవ సంబంధాలు నిలిపివేశాను. నన్ను నేనే కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను. నా తల్లితండ్రుల సాయంతో 2016 లో వైజాగ్‌కి వెళ్లిపోయాను. కొత్త మనుషులు, కొత్త పరిచయం, వెంటాడే పాత కథలు, కొత్త సమస్యలు. ఐతే వాటిని ఎదురుకునే ధైర్యం కూడా వచ్చింది. పాత సమస్యల భారాన్ని నెమ్మదిగా దించుకున్నాను. అప్పుడు ఆధ్యాత్మికత నన్ను అంటుకుంది. "అనుభవించగలిగే వాళ్ళకే సమస్యలు వస్తాయి, అధర్యపడకు", "నువ్వు తెలిసి- తెలియక చేసిన పనులకు కర్మ అనుభవిస్తేనే కర్మ పూర్తి అయ్యి "మంచి-చెడు" మధ్య బేధం గ్రహిస్తావు" అని అప్పుడప్పుడు నేను అక్కడక్కడా విన్న వాక్యాలు ధైర్యాన్ని ఇచ్చాయి.
మళ్ళీ హైదరాబాద్ రావాలని, 2021 మార్చిలో టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. ఇంకో వారంలో ప్రయాణం, ఒక మధ్యాహ్నం ఒకావిడ ఫోన్ చేసింది. "స్కూల్ కి వెళ్ళే పిల్లలకి జనరల్ టాపిక్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెయ్యాలి, అయితే తెలుగులో. ఇదే పోస్ట్ LinkedIn లో పెట్టాము, మీరు అప్లై చేశారని మీ ప్రొఫైల్ నాకు ఇచ్చారు , మీకు ఎంత experience ఉంది?" అని అడిగారు. "అనుభవం లేదు, నాకు తెలుగంటే ఇస్టం ఉంది, రీసెర్చ్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చెయ్యగలను, మేరు ఒక అవకాశం ఇస్తే ఒక శాంపిల్ చేస్తాను, నచ్చితే మీ సూచనాలతో ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వగలను" అన్నాను. ఆవిడ సరే అని ఒక టాపిక్ ఇచ్చారూ, "Wildlife and Reserved Forests of the Telugu states", అని. నాకు తోచింది రాసి అదే రోజు రాత్రి పంపి, నేను హైదరాబాద్ వచ్చేశాను. వచ్చిన ఒక 2-3 రోజులకి ఒక మెయిల్ వచ్చింది "selected for Freelancer- Writer role- Telugu" అని. నేను ఇదంతా నమ్మచ్చా? ఎవరో ఫోన్ చేసారు, నేను రాసిన దానికి సెలెక్ట్ అయ్యానా? వేరే ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు! ఈ కంపెనీ చూస్తే చిరునామా "కేరళ" అని ఉంది. అసలే భవసాగరాలలో మునిగి ఆపుడే ఈత నేర్చుకుని తీరానికి చేరుకున్నాను. అసలు నాకు ఫోన్ చేసినావిడ పేరు కూడా మార్చిపోయాను, ఇప్పుడు ఇంకొకరి నుండి మెయిల్ వచ్చింది. అయోమయంలో పడ్డాను.

Chapter 3: The Serendipitous Encounter

ఒక్కోసారి మంచి కూడా ఎదురవుతుంది.

మెయిల్ ఫార్మాలిటీలు పూర్తి చేశాను. పైగా డబ్బు కట్టాల్సిన వ్యవహారం కాదు. చూద్దాం అని ఒక రాయి వేసాను. అదే మెయిల్ కి రిప్లై ఇస్తూ నాతో మాట్లాడిన ఆవిడతో కనెక్ట్ చెయ్యమని అడిగాను. అప్పుడు వాళ్ళు కనెక్ట్ చేసి ఇకపైన ఆవిడే నాకు టాపిక్స్ ఇస్తానని, నేను చేసే పని ఆవిడకే రిపోర్ట్ చెయ్యాలని చెప్పరు. ఆవిడ పేరుతొ LinkedIn లో వెతికాను. ఆవిడ ఎంతో అనుభవం ఉన్నా రచయిత్రి. కాకపోతే ఇంగ్లీష్ లో చిన్న పిల్లలకి కథలు పుస్తకాలు రాసినట్టు ఉంది. పెద్ద యూనివర్సిటీ లోనే చదువారు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఇలా అనుకున్నది రాసేస్తున్నాను కానీ అప్పట్లో నేను చేసిన Powerpoint Presentation లో ఒక తెలుగు వాక్యం అయ్యక విరమ చిహ్నాలు ఉంటాయనీ కూడా నాకు అవగాహన ఉండేది కాదు. మొత్తానికి నేను ఇచ్చిన శాంపిల్ కూడా పబ్లిష్ అయ్యింది: (https://resorcio.com/products/wildlife-and-reserved-forests-of-the-telugu-lands). ఆతరువాత ఆవిడ నాకు రాయటం అంటే ఏదో సమాచారం పెట్టడం కాదు చదివే మనిషితో ఒక సంబంధం ఏర్పరుచుకోవటం, వాళ్ళకి  ఆసక్తి కలిగించడం అని కొన్ని క్లాసులు కూడా తీసుకున్నారు. "I'm married into a cinema picchi family.  Anyone with interest in movies can also write about them" అని గ్రూప్ లో ఆవిడ ఓసారి మెసేజ్ చేశారు. నేను పాత సినిమాల్లో నటుల గురించి, సాహితీ కారుల గురించి రాసెందుకు స్వేచ్ఛను ఇచ్చారు. అలా కొన్ని వందలు రాసాను, కొన్ని పబ్లిష్ చేసారు ఆ "కేరళ" వారు: ఇక్కడ చూడచ్చు: (https://resorcio.com/creators/nagamruta-mallapragada). విడ్డురంగా, మనుషులు కలవక పోయినా పనిచేయడం Freelancing అని, అందరూ డబ్బులు ఏగొట్టే వారు కాదు, నిజాయితీగా ఉండే వారు కూడా ఉంటారని అప్పుడే తెలిసింది. కర్మ అనుభవించేసాక ఫలితం అనుకూలంగానే ఉంటుందేమో మరి!

Chapter 4: A Connection Unveiled

కంటెంట్ వల్ల కలయిక: ఇంతకీ ఈవిడ ఎవరంటే?

ఇక అసలు విషయం ఏమిటంటే నాకు తెలుగు రాయటం నేర్పించినావిడ ఎవరో కాదు. సినిమాపిచ్చి ఫ్యామిలీ అన్నారు ఎవరా వాళ్ళు అని, ఆవిడ గురించి ఫేస్బుక్ లో వెతికినప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఈవిడ నేను 2015 లో కలుసుకోవాలనుకున్న నటి గారి పెద్ద కోడలు అని. ఈరోజు వరకు ఈవిషయం "ఆవిడకి-ఈవిడకి" నేను చెప్పలేదు. (మీరూ చెప్పకండి). ఎందుకంటె మనం ఒక్కటి జరగాలని బలంగా కోరుకుంటే అది జరిగితీరుతుంది, అది విధి. ఈవిషయం తెలియాల్సినప్పుడే తెలియనివ్వండి. ఒక్కో సారి చెప్పేద్దాం అనిపిస్తుంది. కొన్ని రహస్యం గా ఉంటేనే బాగుంటాయి. నేను నా కష్టాలు  చెప్పుకుని కాస్త ధైర్యం పొందాలని ఆవిడను కలుద్దాం అనుకున్నాను, అదే కుటుంబానికి చెందిన ఈవిడ నాకు మరో రూపంలో మరో అవసరం వచ్చి సాయం చేసారు.

Chapter 5: The Return of a Positive Thought

ఒక సంవత్సరం ముందు ఏమి జరిగిందంటే:

మే 24, 2022:
నాచేత అప్పట్లో తెగ రాయించిన ఈవిడ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు కూడా ఎంతో మానసిక సంఘర్షణ. నేను తెలుగులో చేసిన ప్రాజెక్ట్ అయిపోయింది. అప్పటికే ఈవిడ ఇతర పనుల్లో ఉన్నారు. "కేరళ" కంపెనీ బాస్ హైదరాబాద్ వస్తున్నారు ఇక్కడ ప్రాజెక్ట్ కి పనిచేసిన వాళ్ళల్లో అందుబాటలో ఉన్న వాళ్ళు ఉంటే కలుస్తానని అన్నారట. నాకు తీరిక ఉంటె రామన్నారు. వస్తానన్నాను. చిరునామా వచ్చింది, ఈసారి మారేడ్పల్లి కాదు. గచ్చిబౌలి. ఆ ప్రాజెక్ట్ కి పనిచేసిన ఒక కంటెంట్ రైటర్ గానే వెళ్ళాను, ఒక అరగంట ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి అలాంటి ప్రాజెక్ట్‌లు ఇంకా రావాలని కోరుకున్నాను, వచ్చేశాను. వారు కూడా చక్కగా ఇచ్చిన పని చేసానని అభినందించారు. అంతే. అక్కడతో ఆ ప్రసంగం, ఆ ప్రాజెక్ట్, ఆ మనుషులతో పని, పరిచయాలు పూర్తి అయ్యి, ఆ కథ ముగుసింది. కానీ ఈ పోదున్న google photos లో "one year ago" అని ఆరోజు నేను అక్కడ తీసిన Sunset ఫోటో వచ్చింది.
ఎన్నో జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు వచ్చాయి. కానీ ఇందాక అన్నట్టుగా నా కోరికతో నిజాయితీ ఉందని అదే కోరిక నా వరకు తిరిగి వచ్చి నాకు సాయం చేసి వెళ్లిపోయింది అని అనిపిస్తుంది. ఐతే నేను కలవాలనుకున్న ఆవిడను కలవలేదు. కలవాలని ఈరోజు అనికున్నా కలవటం కష్టం కాదు. కానీ, కలిసినా కలవకపోయినా నాకు అందాల్సిన సాయం అందింది. మేము కలవాలని రాసివుంటే, కలపాలని కాల గమనానికి అనిపిస్తే, కలుస్తానేమో. కలిస్తే మాత్రం ఈ పోస్ట్ చూపిస్తాను. పైగా ఈరోజు Instagram లో కొందరు సెలబ్రిటీస్ నా పోస్ట్లని లైక్ చేస్తునట్టు పెట్టాను. ఒకపని ప్రతిరోజు నిజాయితీగా చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది అని రాయాలనిపించింది. ఈ సంఘటన కూడా పంచుకోవాలనిపించింది.


Comments