నా వరకు షికారు చేసిన పుకారు.
"పుకారు, పుకారు నువ్వు ఏమి చేయగలవు?" అని అడిగితే, ""నీకేం కావాలో చెప్పు? నేను ఏమైనా చేయగలను! ప్రేమకి చిహ్నం అయిన దుష్యంతుడు శకుంతలని మర్చిపోయేలా చేశాను, రాముడు సీతమ్మ నీ అనుమానించేలా చేశాను. ఒక వంశంలో పుట్టిన అన్నదమ్ములు కురుక్షేత్రంలో కొట్టుకుని చచ్చేలా చేశాను. దేనికీ పనికి రాని నీచులని రాజులని చేశాను. అంత గొప్ప చరిత్ర ఉన్న నేను, మీ అమ్మే నిన్ను అనుమానించేలా చెయ్యగలను! నేను చెప్పేవన్నీ నిజాలే అని నిన్ను నమ్మించగలను. అంతెందుకు, నీ మీద నీకే విరక్తి వచ్చేలా చేసేయగలను. ఇదీ అది అని తేడా లేకుండా, మంచి చేయగలను, చెడు చేయగలను, చెడుని మంచిలా మార్చి చెప్పగలను. కృతయుగం కన్నా ముందు పుట్టాను, Chat GPT కన్నా క్రియేటివిటీ ఎక్కువే చూపించి ఏదైనా చెప్పి నమ్మించగలను!" అందట.
"పుకారు షికారు చేస్తుంది" అని విన్నాను. ఎవరి జీవితంలోకైనా స్వేచ్ఛగా ఆహ్వానం లేకుండా వస్తుందని తెలుసు కానీ మనుషుల మొహం లోకి మొహం పెట్టి చూడలేక దూరంగా వెనక నుంచి మాట్లాడుతుందనుకున్నాను. ఈరోజు మరోసారి నా మీద నాకే నా గురించి పుకారు తెలిసినప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మొదటిసారి ఇలా జరిగినప్పుడు, నాకు తోడుగా నా వాళ్ళు నా పక్కనే ఉన్నారు, ధైర్యం చెప్పారు. ఈసారి పుకార్లు చెప్పే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్లే, వాళ్ల స్వభావాలు నాకు తెలిసినవే, నా పక్క పక్కనే ఉంటూ నా గురించి చెప్పారు అంటే కొంచెం నవ్వొచ్చింది, ఇంకొంచం కోపం వచ్చింది, నామీద పడ్డారెంటీ అని అనుమానం వచ్చింది. ఈసారి పుకారు కరీదు నేను అభిమానించే ఒక వ్యక్తికి దూరం అవ్వటం.
ఏదో కంటెంట్ రాస్తున్నాను కదా అని కంటెంట్ రైటర్ ని అని #hashtags ఉపయోగించి మరి ప్రచారం చేసుకుంటున్నాను కానీ పుకారుని పుట్టించిన ఆ దాతలకి మించిన కంటెంట్ రైటర్లు ఉంటారా? వాళ్లు సృష్టించే పుకారు వెళ్ళినంత వేగంగా నేను ఒక కథని రాయగలిగితే, అంత రచనా పాండిత్యమే నాకు ఉంటే ఎప్పుడో ఒక పెద్ద రచయిత్రిని అయిపోయేదాన్నేమో. ఇక పుకారుల సృష్టించేవారు ఒకరి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, అది కూడా మన చుట్టూ ఉన్నవారే అయినప్పుడు, మరీ వీక్ పర్సనాలిటీ అయితే వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది. మరి డేరింగ్ పర్సనాలిటీ అయితే వెంటనే అందరిని చంపేసి జైలుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకి ఇదిగో ఇలా రాసుకోవాలనిపిస్తుంది. పోనీలెండి ఇలాగైనా ఒక బ్లాగ్ పెట్టినందుకు ఏదో ఒకటి రాసుకునే అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నాను.
నేను బాగా అభిమానించే వ్యక్తి ఈరోజు నాకు ఫోన్ చేసి "ఫలానా వ్యక్తి నాకు ఫోన్ చేశారు నువ్వు నా గురించి తనతో అలా అన్నావని నేను విని చాలా ఆశ్చర్యపోయాను! నువ్వు అలా అన్నావు అని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వు ఏమన్నా అన్నావా?" అని అడిగారు. ఇంతకీ ఆయనకి ఆ "ఫలానా ఫోన్" చేసినవారు నేను ఏ పుకారుని లేపాను అనేది చెప్పలేదు, కానీ నేను ఏదో దారుణమైన... కాదు... అతి దారుణమైన విషయం ఏదో చెప్పాను అన్నట్టుగా, ఈయన నన్ను ప్రశ్నించారు..కాదు.. విచారించారు. ఒక క్షణం ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు, ఎన్నో రోజుల తర్వాత ఫోన్ వస్తే ఎంతో ఆత్రం తో ఎత్తాను. నేను అభిమానించే వ్యక్తి నన్ను అనుమానించారా? లేదా నాకు నా గురించి ఇలా పుకార్లు నడుస్తున్నాయి అని సమాచారం ఇచ్చారా? నాకు అర్థం కాలేదు.
ఆయన నాకు వివరాలు చెప్పలేదు. నేను అడగాలనీ అనుకోలేదు. "నేనేమిటో మీకు తెలుసు అనుకుంటున్నాను. నేను చెప్పే ఉంటాను అని మీరు నమ్ముంటే నాకు ఫోన్ చేసేవారు కాదనుకుంటున్నాను, ఫోన్ చేశారు కాబట్టి ఇంకా నా మీద ఎక్కడో మీకు నమ్మకం ఉండి ఉండాలి", అని ఊరుకున్నాను. నేను చెప్పిన సమాధానం ఆయనకి నచ్చలేదని అర్థం అయింది. "సరే నువ్వు అసలు నాగురించి ఏమీ మాట్లాడలేదా?" అని గుచ్చి గుచ్చి అడిగారు. "మాట్లాడే ఉంటాను! మీరు మాట్లాడకూడని విషయం కాదే?", అన్నాను. ఈ సమాధానం నేను వెటకారంగానే అన్నాను. "సరే, నేను వేరే పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను", అని పెట్టేశారు. మళ్లీ మేము మామూలుగా మాట్లాడుకోవడానికి కొన్ని రోజులు.... ఏమో కొన్ని ఏళ్ళ కూడా పట్టొచ్చు, లేదా ఒకరినిఒకరు మర్చిపోవచ్చు. ఏమో నాకు ఉన్న స్నేహితులందరూ అంతే. ఫేస్బుక్లో 500 కి పైగా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 -3 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళి వాడుతున్నా, ఒకరు కూడా "హాయ్ హలో" చెప్పిన పాపాన పోలేదు. నేను కూడా అంతే అనుకోండి, నాకు అవసరం అయినప్పుడు నాకు సాయం చేసిన వాళ్ళు అయితే నేనే పోలో మని హలో చెప్పేదాన్ని. అందుకే Instagram లో తెలిసిన వాళ్ళని ఎవర్ని ఫాలో అవ్వద్దు అని డిసైడ్ అయిపోయాను. సరే విషయానికొద్దాం. ఇంతకీ నేను ఏ పుకార్ని సృష్టించానని నా వరకు వచ్చిందో నాకు తెలియదు. వివరాలు అడిగి నా గురించి నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ పుకారుకి బరువు పెంచిన దాన్ని అవుతాను, ఇక్కడ ఆయనకి తెలియాల్సింది నా వ్యక్తిత్వం, పుకారు లో విషయం కాదు. "నువ్వు నా గురించి ఎదో చెప్తున్నావుట" అని అడిగిన వ్యక్తికి ఏం చెప్పి ఉంటానో చెప్పే ధైర్యం లేకపోతే నేను చేసేది ఏమీ లేదు. నేను ఒకళ్ళని నమ్మించే ప్రయత్నం చేయలేను, పుకారిని ఆపలేను. పుకారు కారు వేగం కన్నా వేగవంతమైనది. అది ఎందరివలనో పుట్టి, ఎందరినో కలిసి, ఇంకాస్త బరువు పెరిగి, ఇంతింతై, వరదై నా దగ్గరికి వచ్చింది, ఆ ప్రవాహం ఆగుతుందని అనుకోను. కానీ నేను అదే పుకార్లు లేపే వాళ్ళ మధ్య బతుకుతున్నాను. రేపు మళ్ళీ వాళ్ళని చూసి నవ్వుతూ మాట్లాడాలి, వాళ్లకి తప్పదు, నాకు తప్పదు. వాళ్ళని అడిగితే వాళ్లకి తెలియదనే చెప్తారు. వీళ్ళ పుకార్లు విన్నవాళ్ళు నాకు ఫోన్ చెయ్యకుండా వీళ్ళ నోటిని కట్టేసి ఉండాల్సింది. ఒకటే బాధ. నాగురించి తెలిసీ, నా మీద ఎలా సందేహం వచ్చింది ఆయనకి? ఆయన అలా అడిగినప్పుడు నా పరిస్థితి ఇది:
నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ గురించి "ఆవిడకి మూడు పెళ్లిళ్లు" అయ్యాయి అని పుకారు చేశారు. కొందరు నవ్వారు. కొందరు "ఆవిడ మనిషా పాంచాలా" అన్నారు. కొందరు నమ్మేసి ఆ విషయాన్ని ఇంకొంతమందితో పంచుకుని ఆవిడ మీద అసహ్యం పెంచుకున్నారు. నేను మాత్రం ఆవిడ పర్సనల్ లైఫ్ లో పెళ్లిళ్లకి కాలేజీలో చెప్పే చదువుకి సంబంధం ఏమిటి అనుకునేదాన్ని. ఆ తర్వాత ఓసారి అనుకోకుండా ఓ షాపింగ్ మాల్ లో కలిసాను ఆవిడని. మాటల్లో ఆవిడ భర్త ఈమధ్య పోయారని, ఆవిడకి ముగ్గురు అన్నయ్యలని, ఆవిడతో ఉన్నది ఒక వదిన అని పరిచయం చేసారు. నాకు అప్పుడు అర్థం అయింది, ఆవిడకున్న ముగ్గురు అన్నయ్యలని, ముగ్గురు భర్తలను చేసి ఎంతోమంది ఆవిడని అసహ్యించుకునేలా చేసింది ఆ పుకారు అని. నేను ఆవిడ గురించి అలా పుకారు ఉందని చెప్చెపలేదు. చెప్వుతే ఆవిడ ఒక క్షణం అయినా బాధపడవచ్చు, దానికి కారణం నేను అవ్వకూడదు. ఇవన్నీ రాసుకుంటున్నది మీరు సానుభూతి చూపిస్తారు అని కాదు. మీ వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకుంటారని. ఏమో మనం సృష్టించిన పుకారే మాన నాశనానికి దారి తీయొచ్చు. నామీద మొదటి పుకారు లేపిన మనిషి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. తప్పు ఎవరు చేసినా, ఎంత చేసినా తప్పే! అనుభవించాల్సిందే.
విన్నవన్నీ నిజాలు కాదు. కళ్ళతో చూసినవని నిజాలు కానే కాదు. మీ వరకు వస్తే గానీ అర్థమయ్యే పరిస్థితికి తెచ్చుకోకండి. మీవరకూ వచ్చినా ప్రోత్సహించాకండి. మీ మీదే పుకారు రేగితే అధైర్య పడకండి. ఈ మధ్య ఈ పుకార్లు లేపే వాళ్ళతో తిరుగుతున్నాను కదా, నాకు అర్థమైంది ఏమిటంటే, వాళ్ళకి సరైన గుర్తింపు రాక, లేక, ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలి, అందరి దృష్టిలో పడిపోవాలి అని చేసే ప్రయత్నం అన్నమాట. వాళ్ళని చూస్తే ఒక్కోసారి నాకు జాలేస్తూ ఉంటుంది. బాపు రమణల సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాను కదా కొన్ని నీతి వాక్యాలు పంచుకుందాం అనిపించింది. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఆస్తి ఈ నీతి వాక్యాలేనండి! అన్నట్టు ఈరోజు ఒక పెద్దాయన నా రీల్ ఒకటి తెగ నచ్చిందని ప్రశంసించారు. ఇంకో ఆవిడ నేను అప్పుడప్పుడు FaceBook లో రీల్ పెడుతున్నాను తరచుగా పోస్ట్ చెయ్యమని రాసారు. నేను Instagram లో ఎక్కువగా పెడతాను అని చెప్తే, ఆవిడ వాళ్ళ అబ్బాయిని అడిగి Instagram లో నన్ను ఫాలో అవుతానన్నారు. నేను ఎవరో తెలియకుండా అభిమానం చూపించేవారు రోజు రోజుకీ పెరుగుతుంటే అదేదో తుత్తి!!
సరేనండి! ఇంకోసారి ఇంకో ఫోన్ కాలో, లెటరో, మెయిలో వచ్చి మళ్లీ స్వల్ప మనస్తాపం చెందినప్పుడు కాకుండా ఆసక్తికరమైన విషయాల గురించి వీలైనప్పుడు రాయడానికి ప్రయత్నిస్తాను.

Comments
Post a Comment