జయమూ, జీవమూ ఉన్న వాణి

జయమూ (అంటే ఆవిడ భర్త జయరాం గారు అన్నమాట), జీవమూ ఉన్న వాణి ఉన్న వాణి జయరాం గారికి పద్మ భూషణ్ వస్తే నాకెందుకింత ఆనందం?

నా చిన్నతనంలో తెలుగు పాట అంటే నాకు తెలిసినవి మా ఇంట్లో నేను విన్న విశ్వనాధ్ గారి సినిమా పాటలు. ఇక స్కూల్ లో ఒక అమ్మాయి ఏ ప్రోగ్రాం జరిగినా పాడే ఒకే పాట "బోల్రే పపీ హరా". ఈ హిందీ పాట పాడిన వాణి జయరాం గారు ఓవర్ నైట్ స్టార్ అయ్యారు అని తరువాత తెలిసింది. అయితే, చాలా చిన్నప్పటినుంచి నన్ను కదిలించిన పాటలో పంక్తులు:

కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబో నీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకుమకెపుడూ ప్రొద్దు గుంకదమ్మా

నాకు తెలియకుండానే నన్ను కదిలించిన పాట. ఈ పాట తరువాత గంగాధర్ అమ్మగారి కుంకుమ నిలబెట్టటానికి ప్రాణ త్యాగం చేసుకుంటాడు. అయితే, ఇది వాణి గారి గొంతు అని తెలుసుకుని అభిమానిని ఐపోయాను. స్వాతి కిరణం సినిమా లో గంగాధర్ పాత్ర తలుచుకున్న ప్రతీ సారి వాణి గారి గోతు నా చివిలో ఇంకా వినిపిస్తుంది. ఆ తరువాత మా స్కూల్ లో మీరా మేడం నా జీవితంలో ఒక ముఖ్య పాత్రధారి. అప్పట్లోనే నేను వాణి జయరాం గారు ఎలా ఉంటారు అని తెలుసుకోవటానికి ఇంటర్నెట్ లో వెతికినప్పుడు, "ఏమిటి ఈవిడ తమిళావిడా? కొంచం మీరా మేడం లా ఉన్నారు, మీరా మేడం కూడా తమిళమే కదా, ఆవిడా ఈవిడా చుట్టాలా?" అని ఆలోచించేదాన్ని. మీరా గారిని అడిగే ధైర్యం లేకపోయింది. కానీ వాణి గారి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండిపోయింది.

ఆ తరువాత, ది హిందూ న్యూస్ పేపర్ లో వాణి గారి ఇంటర్వ్యూ లో చదివాను, ఆవిడని హిందుస్తానీ నేర్చుకొమ్మని ప్రోత్సహించింది ఆవిడ భర్త జయరాం గారే అని. అలా హిందీ సినిమా పాటలలోకి ప్రవేశించిన ఆవిడకి ఎప్పుడు ఏ పాట రికార్డింగ్ అయినా జయరాం గారు వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లేవారని. భార్య భర్తలు ఇలా కూడా ఉంటారా? అని  ముచ్చటేసింది. భార్యకి తోడుగా ఆయన చివరివరకు ఉన్నారు. వాణి, జయరాం ఇద్దరు అయినా ఒకే మాటగా ఎలా పిలుస్తున్నామో అలా బ్రతికి కూడా చూపించారు. జయరాం గారు 2018 లో కన్ను మూశారు.

నిజానికి వాణి గారు హైదరాబాద్ ఎస్బిఐ లో పని చేస్తున్నప్పుడు ఆవిడ అత్తగారు వాణి గారి గొంతు విని కోడలు చేసుకోవాలనుకున్నారట. ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె లో (https://www.youtube.com/watch?v=-5SeY0HbVEw) వాణి గారు "నా పెళ్లి సికింద్రాబాద్ లో అయ్యింది" అని చెప్పినప్పుడు ఓహో ఈవిడ మనం ఉన్న చోట ఉన్నారని ఆనందం వేసింది. సరే, ముంబై వెళ్ళాక అక్కడ "గుడ్డి" సినిమా పాట వలన పేరు వచ్చేసరికి అక్కడ సింగెర్స్ మీటింగ్ పెట్టుకున్నారని, ఆతరువాత వాణి గారికి అవకాశాలు రాలేదని తెలిసి బాధ కలిగింది. పోనీ లెండి, వాళ్లకి పట్టని ఆ అదృష్టం తెలుగు సినిమా కి పట్టింది. అదే సమయం లో విశ్వనాధ్ గారి సినిమాలలో మగ గొంతుకి ఎస్పిబి గారు ఎలాగో ఉన్నారు, కష్టమైన శృతులను యిట్టె పట్టేసే వాణి గారిని తీసుకున్నారు మహదేవన్ గారు. మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన పాటలకి ప్రాణం పోశారావిడ. 

ఇలాంటి వాళ్ళు తెలుగుని, తెలుగు సినిమాని బ్రతికించిన వారు. ఇప్పుడు ఎందుకో వీళ్ళని మన తెలుగు వాళ్ళు మర్చిపోయారు. ఆవిడకి స్వయంగా నేను "మీ పాటంటే చెవి కోసుకుంటాను" అని చెప్పాలని ఉంది, ఆవిడ నాకు ఏ సోషల్ మీడియా లోనూ కనిపించలేదు. కానీ, నా మాట వింటే మాత్రం కచ్చితంగా తెలుగులోనే స్పదిస్తారేమో. ఆవిడకి తెలుగంటే అభిమానం. "Why should we hate any language?" అంటారు ఆవిడ. ఇలా ఒక భాషలో పాడేందుకు ఆ భాషను నేర్చుకుని మరీ పడేవారు ఆరోజుల్లో. ఇలాటి వారికి అభిమానులు కరువైపోవటం, వాళ్ళని కనీసం గుర్తుకు తెచ్చుకోలేకపోవటం దురదృష్టం. ఈరోజుల్లో కొందరిని స్టార్స్ అనే వారు వీళ్ళకి కనీస మర్యాద ఇవ్వట్లేదని ఆవిడ బాధ పడ్డారని స్వయంగా చెప్పారు. మన భాష అంటే నాకు ఇష్టం, మన భాషని గౌరవించే వాటంటే నాకు ఇంకుతో ఇష్టం. నాకు సాధారణంగా వేరే మాతృ బాషా గాయకులు తెలుగు పాటలు పాడితే నచ్చదు, ఈవిడ లాంటి వారు తప్ప. అలాంటి వారి గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం. ఏది ఏమైనా, విశ్వనాధ్ గారి సినిమా లో పని చేసిన ప్రతి ఒక్కరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. వాణి జయరాం గారికి పద్మభూషణ్ రావటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. 

Comments