డండనకర నకర నకర...

గోల్డెన్ గ్లోబ్స్ గెలుచుకున్న "నాటు నాటు" పాట, అవార్డు దేనికి ఇచ్చినట్టు?

పాట రాసిన చంద్రబోసు గారికా?  
పాటకి వెర్రి బీటు బాదిన కీరవాణి గారికా? 
పాటని ఆ ఇద్దరు హీరోలు పోలేరమ్మ జాతరలో పోతరాజుల్లా రెచ్చిపోయి చిందులేసినందుకా?
ఆ సాంగ్ కి స్టెప్పులు తిక్క నాటుగా, ఊర నాటుగా కంపోస్ చేసిన ప్రేమ్ రక్షిత్ గారికా? ఖర్చుకు వెనుకాడకుండా డివివి సంస్థ వారు ఇప్పటికీ దీని ప్రమోషన్లకు వెనుకాడని  వారి దూరదృష్టికా?
పాట పాడిన హాహుల్ అండ్ కాలభైరవకా? 
ఆ ఊపులో కూడా పర్ఫెక్షన్ కోసం ఒక 65 సార్లు మళ్ళీ మళ్ళీ చేయించినందుకు రాజమౌళి గారికా?

ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టడం మొదలు ప్రతి ఇద్దరు కలిసినప్పుడల్లా ఒకటే స్టెప్పు.  ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతీ పండగకు, పబ్బులకు తెలుగు సంతకం అయ్యి, ఇప్పుడు ఈ పాట ప్రాంతాలు దాటి, భాషలు దాటి ఖండాలు దాటి అమెరికన్ ఆడియన్సు ని కూడా ఊపేస్తోంది. మనం ఎంత గర్వ పడినా పాడకపోయినా ఈ పాటకి ఆస్కార్ రాకపోతే రయోట్ కి సిద్ధం అంటున్నారు వారు. ఈ టీమ్ ఇంటా గెలిచారు... రచ్చ గెలుస్తున్నారు. ఇక్కడ అభిమాన శక్తి కి వచ్చిన క్రేజ్ అటువంటిది.

అంటే అంత గొప్ప పాటా ఇదీ?

తెలుగు లో సాహిత్య ప్రధానంగా పాటలు రావటం కష్టం, వస్తే ఏడుపు మ్యూజిక్ పెట్టి నాశనం చేస్తారు. ఒక్కో సారి పాడే వారు బాగా పడినా ఆ పదాలు అరువు తెచ్చుకున్న వేరే భాష పదాలులా ఉంటాయి. ఒక్కోసారి పాట బాగుంది కదా అని సినిమా చూస్తే అక్కర్లేని సందర్భంలో ఉన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి అన్ని కుదిరినా ఎందుకో సరిగ్గా ఆ సినిమా యూనిట్ తమని తాము ప్రమోట్ చేసుకోరు. ఇలా కొద్దో గొప్పో మంచి గొప్ప పాటలు ఉన్నా అన్నీ కుదరాలి ఒక పాట హిట్ అయ్యి జనాల మధులలో నిలిచుపోయి, పూనకం వచ్చినట్టు వారిని ఊపాలంటే! 

థిస్ ఇస్ ఏ కంప్లీట్ సాంగ్!

ఈ పాట కి అన్ని కుదిరాయి. పాట తీసే తప్పుడు దీనికి ఇంత ఘనత దక్కుతుందని కానీ, దక్కాలని కానీ రాజమౌళి గారు అనుకుని ఉండరు కానీ అయన ఖర్చుపెట్టిన రూపాయికి 100 శాతం న్యాయం జరిగిందా లేదా అన్నది చూసికున్నారు. నిజానికి 100 శాతం అనేది కూడా తప్పేనేమో. ఈ పాటలో సింక్ అయ్యింది రామ్ చరణ్, ఎన్టీఆర్ ల స్టెప్పులే కాదు, ఆ సినిమాకి పనిచేసిన 64 కళలు కూడా. అసలు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ మహామహులే ..ఎవరికి వారు ఒక్కో కేటగిరి లో నామినెటే అవ్వాల్సిన వారే! కానీ ఈ కలయిక తిరుగులేనిది అయ్యింది, ఈ పాటని లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా ఊపేలా చెయ్యటానికి సహాయపడ్డారు.

పాట సందర్భం

ఈ పాట మనల్ని బానిసలు చెయ్యాలనుకున్న తెల్లోళ్ళ పార్టీ లో తెలుగోడి చావు దెబ్బ చూపించే సన్నివేశం. నిజానికి ఇద్దరు హీరోలు స్టెప్పులు వేసిన పాటలు  గతంలో ఎన్నో ఉన్నా కూడా ఇప్పుడు ప్రతీ ఒక్కరూ తమని తాము ఇందులో చూసుకుని "అదిరా తెలుగోడి సత్తా" అనుకునేలా ఉంటుంది. పైగా సినిమా అంటే  హాలీవుడ్, బాలీవుడ్ అనుకునే జనానికి ఇంత వీర పిచ్చెక్కించే పాట భాషతో సంభంధం లేకుండా ఊగిపోవాలనిపించింది. ఇంకా పైగా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా  బ్రిటిష్ వారి వలన ఇబ్బంది పడిన వారే కానీ ఇక్కడ విషయం అది కాదు. 

ఈ నిముషంలో ఈ సెకను లో కూడా ఈ ఇద్దరు హీరోల ప్యాంటు కూడా ఒకేలా లేచిందే  అంటూ గుర్తిస్తున్నారు అంతర్జాతీయ అభిమానులు. మనం కూడా అంతగా ఈ పాటని అంతగా పట్టించుకుని ఉండమేమో. ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు  అందరికీ పచ్చి మిరప లాగ పిచ్చ నాటు నాటు...


ఇక ఆస్కార్ వచ్చినా రాకపోయినా మన తెలుగు వెలుగు చేసేస్తోంది! ఈ పాట అర్ధం పరమార్ధం, సినిమా లో ఈ పాట లక్ష్యం, లక్షణం, ఈ సినిమా లో అంశాలు, అన్ని పక్కన పెడితే, ఇది మన తెలుగు పాట, అంతర్జాతీయ గౌరవం సొంతం  చేసుకుంటూ తెలుగోడి సత్తా చూపుతున్న తెలుగు ప్రతిభకి ఇచ్చిన సత్కారం. మనిషిగా తెలుగు నెల మీద పుట్టినందుకు తెలుగు  భాషకి తెలుగు పాట కి గౌరవం దక్కుతున్నందుకు నాకు చాలా ... విపరీతంగా ఆనందంగా ఉంది! ఒకప్పడు ఇక మ్యూజిక్ చెయ్యనని అనుకున్న కీరవాణి గారికి నిజానికి ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తోంది. ఆయన అనుకున్నట్టు రిటైర్మెంట్ తీసుకుని ఉండిఉంటే ఈరోజు నాటు నాటు కి ఆస్కార్ వాదిక అయ్యి ఉండేదా?

డండ నకర నకర నకర ....


Comments