"సేతు" సినిమా పాటలో కృష్ణ లీలా తరంగం

కృష్ణ లీలా తరింగిణీ భక్తి గీతాలు

ఒక్కోసారి మనం పాట వింటుంటే ఆ పాట ఉన్న సన్నివేశం గుర్తుకు వచ్చినట్టు నాకు కొన్ని పాటలు వింటుంటే కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఈ పాట నా చిన్నప్పుడు ఒక ఆవిడ తెగ పాడేది.  అప్పుడు నేను చిన్న దాన్ని కదా, ఎంబీఏ చేస్తూ సంగీతం నేర్చుకుంటే సంగీతం మాష్టారు ఇలాంటి పాటలు నేర్పిస్తారు అనుకున్నా.

కొంచం పెద్దయ్యాక తెలిసింది ఇది "విక్రమ్" గారు నటించిన తమిళ సినిమా "సేతు" లో హీరోయిన్ ఇంట్రొడక్షణ్ సాంగ్ అని, ఇళయరాజా గారి సంగీతం లో సింగర్ సుజాత గారు పాడారు అని. ఈ సినిమాని జీవిత గారు తెలుగులో రాజశేఖర్ గారిని పెట్టి "శేషు" అని మళ్ళీ తీశారని. ఈ తెలుగు సినిమా తోనే ఇళయరాజా గారి అబ్బాయి యువన్ శంకర్ రాజా గారు తెలుగు సినిమాకి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే "శరణం భవ కరుణామయి" అన్న పాటని అలాగే ఉంచేశారు తెలుగు వెర్షన్ లో కూడా. ఈమధ్య మళ్ళీ నాకు తెలిసినావిడ ప్రస్తావన వచ్చి ఈ పాట తెగ వినేసాను. ఇందులో "వినతాసుత" అని వచ్చింది. నేను ఈమధ్య ఓ యుట్యూబ్ ఛానల్ కి గరుడు గురించి కథ రాశాను.  (https://youtu.be/p09WyspDpQ4). అందులో గరుడు వినత కి పుట్టాడని వచ్చింది. ఈ పాట అసలు ఎవరి గురించి అని ఆరా మొదలయ్యింది. ముందుగా పాట అర్ధం చూద్దామా:

శరణం భవ కరుణామయి కురు దీనదయాళో
కణారస వరుణాలయ కరిరాజ కృపాళో ॥
అధునాఖలు విధినామయి సుధియాసురభరితం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్‌ ॥
ఓ శరణం ఇచ్చే కరుణామయి (కరుణారస), కురు వంశాన్ని కాపాడిన దీన భాందవా (దీనదయాళో), తీవ్ర మనోవేదనకు గురైన ఏనుగు రాజు (కరిరాజ) పై దయతో కృప చూపించిన వాడా (కృపాళో), మధు అన్న రాక్షసుడిని (మధుసూదన), భరించలేని హింసపెట్టే (అధునాఖలు విధినామయి) అసురుల గుంపుని (సుధియాసుర) సంహరించిన వాడా, నా పాపాలు కడిగేసి నన్నూ కష్టాల (దురితమ్‌) నుండి విడిపించు (హరమామక), 
ఘృణిమండల మణికుండల ఫణిమండలశయన
అణిమాది సుగుణభూషణ మణిమంటప సదన
వినతాసుత ఘనవాహన మునిమానస భవన
మధుసూదన మధుసూదనహర మామకదురితమ్‌ ॥ 

అద్భుతంగా ప్రకాశించే (ఘృణి మండల) మణితో అలంకరించబడిన (మణి కుండల) సర్పం ఆదిశేషునిపై నిద్రించేవాడా (ఫణి మండల శయనా) (అణిమన్) సూక్ష్మ శరీరం నుండి అనంత రూపాలలో సద్గుణాలతో మణిమంటపంలో (సదన) నివాసం ఉండే వాడా, వినతాసుత (గరుడ, వినత కుమారుడు) ఘన వాహనంగా (మహా వాహనం) ఋషుల మనస్సులలో నివసించేవాడా (ముని మానస భావన), మధు సంహారకుడా, నా కష్టాల నుండి విముక్తి కలిగించు (మధుసూదనహర మామకదురితమ్‌).


అన్నట్టు ఈ పాటని భానుమతి రామకృష్ణ గారు కూడా ఓ సినిమాకి పాడారు (https://www.facebook.com/watch/?v=276964166507428). ఆవిడ తన సినిమాల్లో అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలు ఒక్కటైనా ఉండేలా చూసుకునేవారట. ఈవిడ గురించి నేను ఆమధ్య చేసిన ప్రెసెంటేషన్ వీలుంటే చూడండీ (https://resorcio.com/products/the-great-versatile-actress-of-yesteryears-bhanumati-ramakrishna)
అంటే ఇది కచ్చితంగా సినిమా పాటైతే కాదు.

"శ్రీ నారాయణ తీర్థ" ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో పుట్టి, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజాలో ఉండేవారు. ఓసారి, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడి తనకు శక్తి ప్రసాదించమని ప్రార్థించిన్నప్పుడు ఒక దివ్య స్వరం ఓ వరాహాన్ని అనుసరించమంటే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, వేంకటేశ్వర స్వామి ఉన్న ఆలయం`కుడమురుట్టి' నది ఒడ్డున చేరి స్థిరపడి "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" అనే సంస్కృత నృత్య నాటకాన్ని రచించారు. అందులో ఒక పాట తరంగమే ఇది.

(https://andhrabharati.com/kIrtanalu/nArAyaNatIrtha/index.html)

ఇందులో చరణాలే సినిమా పాటల్లో వాడేశారన్నమాట. ఈ పుస్తకం ఇక్కడ కూడా ఉంది, (https://archive.org/details/SriKrishnaLeelaTarangini/page/n23/mode/2up)






Comments