అల్లూరి అంటే అప్పుడెప్పుడో చదువుకున్న స్వతంత్ర యోధుడే కాదు
ఒక ధర్మాధికారి కూడా!
సెప్టెంబర్ 23న అల్లూరి అని శ్రీ విష్ణు గారి సినిమా విడుదల అయ్యింది కానీ మనం దీని గురించి పెద్దగా మాట్లాడుతున్నట్టు లేదు. అదే, మాట్లాడే ఉద్దేశం ఉందొ లేదో కూడా నాకు తెలియదు. సినిమా విషయానికి వస్తే సినిమా కథ చెప్పే విధానం నాకు నచ్చింది. సినిమా మొదట్లో ఒక యువకుడు ఎస్ఐ పోస్ట్ కోసం ట్రై చేస్తూ తాను చేసే శ్రమకి ఇక ఫలితం ఉండదని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేద్దాం అనుకున్నప్పుడు ఆ యువకుడి తండ్రి చెప్పిన అల్లూరి రామ రాజు అనే పోలీస్ ఆఫీసర్ కథే ఇది.
ఆ పోలీసు లంచం ఇస్తే చెత్తబుట్టలో పడెయ్యగలడు. గూండా నాయకుడికి డ్రైవెర్గా పనిచెయ్యమన్న పై అధికారిని కొట్టి నీతి తప్పకుండా ఉండగలడు, పిరికిగా భయపడుతున్న కాలేజీ అమ్మాయిల చేత రాగింగ్ పేరుతో హద్దు మీరే వాళ్ళ చెంపలు వాయించగలడు, ధైర్యం గా సాక్షం ఇవ్వటానికి ఒక అవిటి వాడికైనా ప్రేరణ ఇవ్వగలడు.
ఇందులో కొత్తేముంది చాలా సినిమాల్లో ఇలాంటివి చూశాము, ఘర్షణ సినిమాలో వెంకటేష్ లాగా అనుకుంటున్నారేమో!
ప్రతీ సినిమాలో ఒకడే హీరో వాడే అన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నవాడిలా మనకి చూపిస్తారు. అయితే ఈ పోలీస్ తో పని చేసిన సగటు పోలీస్ నుంచి నక్సలైట్ల వరకు అందరికి నమ్మకం కలిగించే మొనగాడు అల్లూరి, అతనితో ఉన్న వారిని కూడా హీరోలుగా మార్చగలడు. దేనికీ భయ పడడు . నేను పోతే నా స్తానం లో వచ్చేది పోలీసే. పోలీస్ అంటే వ్యవస్థ అని చాటి చెప్పే వాడు. తనలోని అధికారాన్ని తన రాక్షసత్వానికి అడ్డు రాకూడదని ధర్మాన్ని పట్టుకున్న రాముడు. కంప్లైంట్ ఇవ్వటానికి జనాలు స్టేషన్ కి రాకపోతే మనమే వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ పనులు చేసిపెట్టాలి, చెప్పటానికి వంద కారణాలు, చెయ్యటానికి వెయ్యి మార్గాలు అని మార్గాన్ని చూపించిన మార్గదర్శి. వచ్చే తరం లో కొందరైనా పోలీస్ అవ్వాలనుకునేంతలా ప్రేరేపించే ధర్మాధికారి. రాస్తున్న నాకే స్పూర్తినిస్తోంది అతని కథ, అందుకే ఒక మంచి సంకల్పంతో తీసిన ఈ సినిమా కి నా వంతు రివ్యూ ఇవ్వాలనిపించింది.
సినిమాలో పాటలు నాకు పెద్దగా ఎక్కలేదు. మాటలు బాగున్నాయి. సినిమాలంటే తెచ్చిపెట్టుకున్న వేష భాషలెనా? (అంటే ఇదే సినిమాతో విడుదల ఐన మరో సినిమా గురించి చెప్తున్నాను లెండి, పుట్టినందుకు ఎదగటం, పెళ్లి చేసుకోవటం, కాపురాలు చేసుకుని పిల్లల్ని కనటం, ఇంతేనా జీవితం?) ధర్మాన్ని పట్టుకున్న సినిమాల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుందాం.
జై హింద్
Comments
Post a Comment